అసెంబ్లీ వద్దు, పార్లమెంటే ముద్దు!.. తెలంగాణ బీజేపీ సీనియర్ల తీరు.. ఎందుకంటే?

By Mahesh K  |  First Published Oct 26, 2023, 5:32 PM IST

తెలంగాణ బీజేపీ సీనియర్లు అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగడానికి అనాసక్తి చూపిస్తున్నారు. లోక్ సభ ఎన్నికలే బెటర్ అనే మూడ్‌లో ఉన్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఆలోచనలు చేయడానికి ఏం కారణాలు ఉన్నాయి? ఎందుకు పార్లమెంటు ఎన్నికల వైపు మొగ్గు చూపుతున్నారు?
 


హైదరాబాద్: తెలంగాణ బీజేపీ సీనియర్ నేతలు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలబడటానికి ఆసక్తి చూపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో కాకుండా పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయాలని వారు భావిస్తున్నారు. దీంతో వారికి కేటాయించిన సీట్లలో ఎవరిని నిలబెట్టాలనే డైలమా పార్టీలో మొదలైనట్టు తెలుస్తున్నది. 

ఎంపీలు సహా సీనియర్లను తెలంగాణ అసెంబ్లీ బరిలో నిలబెడతామని బీజేపీ భావించింది. కానీ, సీనియర్లు మాత్రం అందుకు అంగీకరించడం లేదు. మాజీ ఎంపీలు ఏపీ జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జీ వివేక్ వెంటకస్వామి, మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనాసక్తిగా ఉన్నట్టు సమాచారం. అభ్యర్థుల జాబితా నుంచి తమ పేర్లను తొలగించాలని పార్టీ అధిష్టానాన్ని కోరినట్టు తెలిసింది. 2024 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికే వారు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఎంపీ బండి సంజయ్ కుమార్ కూడా కరీంనగర్ నుంచి అసెంబ్లీ బరిలో దింపడంపై అసహనంగా ఉన్నట్టు కథనాలు వస్తున్నాయి.

Latest Videos

దీంతో గద్వాల్, మహబూబ్ నగర్, తాండూర్, చెన్నూర్ అసెంబ్లీ స్థానాల బరిలో ఎవరిని నిలబెట్టాలా? అని బీజేపీ భావిస్తున్నది. కాగా, కిషన్ రెడ్డి, కే లక్ష్మణ్‌లను బీజేపీ అంబర్‌పేట్, ముషీరాబాద్ స్థానాలలో దింపడం లేదు. దీంతో ఈ స్థానాల్లో ఎవరిని ఎంచుకుంటున్నారా? అనే ఆసక్తి పార్టీలో నెలకొంది. అంబర్ పేట్ నుంచి కిషన్ రెడ్డి తన భార్య కావ్య రెడ్డిని బరిలో నిలబెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు, ఆ విషయాన్ని పార్టీ నాయకత్వానికి కూడా తెలియజేసినట్టు సమాచారం. ముషీరాబాద్ సీటు కోసం ఐదుగురు పోటీ పడుతున్నారు. బీజేపీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, పావని కుమార్, బండారు దత్తాత్రేయ కూతురు విజయ లక్ష్మీలు కూడా ఈ పోటీలో ఉన్నారు.

Also Read: బీజేపీపై బండి సంజయ్ అసంతృప్తి.. ‘నా ఇమేజ్ దెబ్బతీయడానికే కరీంనగర్ టికెట్’

కాగా, గద్వాల్ నుంచి బీసీ నేతకు టికెట్ ఇవ్వాలని డీకే అరుణ కోరుకుంటున్నారు. జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డిలు మాత్రం తమ సన్నిహితులకు టికెట్లు ఇవ్వాలని అనుకుంటున్నారు.

అసెంబ్లీ ఎన్నికలపై సీనియర్లు ఆసక్తి చూపకపోవడానికీ పలు కారణాలు ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎమ్మెల్యేగా గెలిచినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి బీజేపీకి లేదు. గెలవడమూ కత్తిమీద సాములాగే ఉన్నది. ఓడిపోతే పార్లమెంటు ఎన్నికల్లోనూ పోటీ చేసే ప్రయత్నాలు ఉంటాయి. అలాంటప్పుడు రెండుసార్లూ ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ దృష్టి మరింత పెంచుతుంది. ప్రధాని మోడీ ప్రభతో లోక్ సభ ఎన్నికల్లో గెలవడమూ సాధ్యం అవుతుందనీ బీజేపీ సీనియర్ల మదిలో ఉన్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

click me!