హరీశ్ ఆరడుగుల బుల్లెట్ .. సిద్ధిపేటలో నేనున్నా ఇంత అభివృద్ధి అసాధ్యం : మేనల్లుడిపై కేసీఆర్ ప్రశంసలు

సిద్ధిపేటలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో తన మేనల్లుడు, మంత్రి హరీశ్‌రావుపై ప్రశంసల వర్షం కురిపించారు ముఖ్యమంత్రి కేసీఆర్ . ఆయన ఆరడుగుల బుల్లెట్ అని.. ఈసారి కూడా రికార్డు స్థాయి మెజారిటీతో గెలిపించాలని సీఎం పిలుపునిచ్చారు.  


సిద్ధిపేట గడ్డ రుణం తీర్చుకోలేనన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సిద్ధిపేటలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగిస్తూ.. ప్రతీ సందర్భంలో సిద్ధిపేట తనను విజేతగా నిలబెట్టిందన్నారు. సిద్ధిపేట పేరు వింటే స్వర్గం కంటే నా జన్మభూమి గొప్పది అనే భావన కలుగుతుందన్నారు. సిద్ధిపేటలో నేనున్నా .. హరీశ్‌రావు చేసినంత అభివృద్ధిని చేయలేకపోయేవాడినని కేసీఆర్ తెలిపారు.  

తనను సీఎంను చేసింది.. ఇంత ఎత్తుకు చేర్చింది సిద్ధిపేటేనని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సిద్ధిపేట గడ్డ నన్ను నాయకుడిని చేసిందన్నారు. తెలంగాణ ఉద్యమం విజయం సాధించడానికి పునాది వేసింది సిద్ధిపేట గడ్డనే అని కేసీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపామని సీఎం పేర్కొన్నారు. 

Latest Videos

ALso Read: ధరణి ఎత్తేసేందుకు కాంగ్రెస్ రెడీ .. ఉండాలో , వద్దో తేల్చుకోండి : సిరిసిల్లలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

ఒకప్పుడు సిద్ధిపేటలో మంచినీళ్ల కరువు వస్తే వాటర్ ట్యాంకర్లతో నీళ్లు తెప్పించామని ఆయన గుర్తుచేశారు. మిషన్ భగీరథ రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నామని.. సిద్ధిపేటలో తాను తిరగని రోడ్డు, గ్రామం, చెరువు లేదన్నారు. ఒకప్పుడు బంగారం లాంటి భూములు వున్నా పంటలు పండించుకోలేకపోయామని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. 50 సంవత్సరాల పాటు సిద్ధిపేట ప్రజలతో కలిసిమెలిసి బతికానని సీఎం గుర్తుచేసుకున్నారు. కేంద్రమంత్రిగా వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆరడుగుల బుల్లెట్ హరీశ్‌రావును మీకు అప్పగించానని కేసీఆర్ అన్నారు. ఆయనను మరోసారి రికార్డు స్థాయి మెజారిటీతో గెలిపించాలని సీఎం కోరారు. 

సిద్ధిపేటకు మెడికల్ కాలేజీ, ఇంజినీరింగ్ కాలేజీలు వచ్చాయని సీఎం తెలిపారు. సిద్ధిపేటకు హరీశ్‌రావు పట్టుబట్టి మరీ ఐటీ హబ్‌ను తెచ్చారని కేసీఆర్ ప్రశంసించారు. దళితుల కోసం కాంగ్రెస్ చేసిందేమీ లేదని సీఎం దుయ్యబట్టారు. సిద్ధిపేటలో లేనిదంటూ ఏం లేదని.. ఒక్కటే తక్కువ వుందని అది విమానం రావడమేనని కేసీఆర్ పేర్కొన్నారు. సిద్ధిపేటలో జరిగిన ఘటనే దళితబంధుకు ప్రేరణ అని.. దళితులకు దశలవారీగా న్యాయం చేస్తానని ముఖ్యమంత్రి చెప్పారు. 
 

click me!