కాంగ్రెస్ తో సీట్ల సర్ధుబాటుపై చర్చలు సాగుతున్నాయి. సీట్ల కేటాయింపు విషయంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న తీరుపై లెఫ్ట్ పార్టీలు అసంతృప్తితో ఉన్నాయి.
హైదరాబాద్: కాంగ్రెస్ తో సీపీఐ, సీపీఎంల సీట్ల సర్ధుబాటు చర్చలు సాగుతున్నాయి. సీపీఐ, సీపీఎంకు రెండేసీ అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ నాయకత్వం అంగీకరించింది. చెన్నూరు, కొత్తగూడెం అసెంబ్లీ స్థానాలను సీపీఐకి కేటాయిస్తామని కాంగ్రెస్ తేల్చి చెప్పింది.
అయితే చెన్నూరుకు బదులుగా మునుగోడు అసెంబ్లీ సీటు ఇవ్వాలని ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సీపీఐ నేతలు కోరుతున్నారు. మునుగోడు అసెంబ్లీ సీటు ఇవ్వాలని కాంగ్రెస్ నాయకత్వాన్ని కోరాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణను నల్గొండ జిల్లాకు చెందిన సీపీఐ నేతలు నిన్న కోరారు. ఈ విషయమై కాంగ్రెస్ నాయకత్వంతో మాట్లాడుతానని నారాయణ నల్గొండ నేతలకు హామీ ఇచ్చారని సమాచారం.
undefined
కొత్తగూడెంలో సీపీఐ రాష్ట్రసమితి కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పోటీ చేయనున్నారు. చెన్నూరులో ఎవరిని బరిలోకి దింపాలనే విషయమై సీపీఐ నాయకత్వం అన్వేషణ ప్రారంభించింది. అయితే అదే సమయంలో మునుగోడు స్థానాన్ని పొత్తులో తీసుకోవాలని నల్గొండ నేతలు పట్టుబడుతున్నారు.ఈ అంశం సీపీఐలో చర్చకు దారి తీసింది.
మరో వైపు సీపీఎంకు కేటాయించే సీట్ల విషయంలో కూడ కాంగ్రెస్ ఇంకా తేల్చి చెప్పలేదు. మిర్యాలగూడ అసెంబ్లీ స్థానాన్ని కేటాయించేందుకు కాంగ్రెస్ సానుకూలంగా ఉంది. ఖమ్మం జిల్లాలోని పాలేరు, భద్రాచలం సీట్లను కూడ సీపీఎం కోరింది. అయితే భద్రాచలంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పోడెం వీరయ్యకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు కేటాయించింది. దీంతో భద్రాచలంలో సీపీఎం ఇవ్వబోమని తేల్చి చెప్పింది
కాంగ్రెస్. మిర్యాలగూడ అసెంబ్లీ స్థానం సీపీఎంకు ఇచ్చేందుకు సానుకూలంగా ఉంది. కానీ మరో సీటు విషయమై ఇంకా తేల్చలేదు. పాలేరు, ఇబ్రహీంపట్నం సీట్లలో ఏదో ఒక సీటు ఇవ్వాలని సీపీఎం కోరుతుంది. పాలేరు సీటును సీపీఎంకు కాంగ్రెస్ ఇచ్చే పరిస్థితి లేదు. ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్ధిగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బరిలోకి దింపనుంది.
also read:పరకాల నుండి బరిలోకి:కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్న రేవూరి
సీట్ల సర్ధుబాటుపై కాంగ్రెస్ పార్టీ ఇంకా తేల్చకపోవడంతో లెఫ్ట్ పార్టీ నేతలు కొంత అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం కూడ సాగుతుంది. సీట్ల సర్ధుబాటుపై తేల్చకపోతే ఒంటరిగా కూడ పోటీ చేసేందుకు వెనుకాడబోమని సీపీఎం కాంగ్రెస్ కు సంకేతాలు ఇచ్చిందని సమాచారం.