
హైదరాబాద్: శాంతి భద్రతలకు విఘాతం కల్గించే వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని సీఎల్పీ నేత జానారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. కత్తి మహేష్‌లాంటి వారు చేసే వ్యాఖ్యలు శాంతి భద్రతలకు ఇబ్బందిగా మారే అవకాశం లేకపోలేదని ఆయన అభిప్రాయపడ్డారు.
బుధవారం నాడు ఆయన సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సమాజంలో ఆందోళనలు కల్గించేలా మాట్లాడడం సరైంది కాదన్నారు. జర్నలిస్టులు కూడ సంయమనాన్ని పాటించాలని ఆయన సూచించారు. అసహ్యకరమైన మాటలను ప్రచురించకూడదని ఆయన సలహ ఇచ్చారు. సంస్కార హీనంగా మాట్లాడినా తప్పేనని ఆయన చెప్పారు.
కత్తి మహేష్ మాట్లాడిన మాటలు, చేసిన వ్యాఖ్యలు, సమాజంలో భావోద్వేగాలు రెచ్చగొట్టేవిధంగా ఉన్నాయన్నారు.ఈ వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు
టెర్రరిస్టుల కు,ఇలాంటి కత్తి మహేష్ లాంటి వారికి తేడాలేదన్నారు.
రేషన్ డీలర్ల సమస్యను పరిష్కరించేందుకుగాను ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రైతులకు పెట్టుబడి సహాయం కోసమే రైతు బంధు పధకాన్ని ప్రవేశపెట్టలేదని ఆయన అభిప్రాయపడ్డారు.
రైతు బంధు పథకం అసలు లక్ష్యం నెరవేరడం లేదన్నారు. రైతుబందు పథకంపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వ్యవసాయం చేసేవారికి మాత్రమే సహాయం అందాల్సిన అవసరం ఉందన్నారు.మావోయిజం, టెర్రరిజం అరికట్టేందుకు ముందస్తు చర్యలు ఎలా తీసుకుంటారో కత్తి మహేష్ లాంటి వారిపై కూడ అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
వరంగల్ జిల్లాలో జరిగిన బాణ సంచా ఫ్యాక్టరీ ప్రమాదంలో మృతులకు జానారెడ్డి దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. గాయపడిన వారికి అత్యవసర చికిత్స అందించాలని ఆయన అధికారులను కోరారు.