ఎంతోకాలంగా తను అలయ్ బలయ్ కార్యక్రమానికి రావాలని కోరుకున్నప్పటికి ఇవాళ ఆ కోరిక తీరిందని మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. ప్రేమను పంచే ఇలాంటి కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆ యన అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్: ప్రేమను ఇతరులకు పంచేందుకు ఉద్దేశించిన అలయ్ బలయ్ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని ప్రముఖ తెలుగు సినీ నటుడు చిరంజీవి చెప్పారు.
హైద్రాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో గురువారం నాడు అలయ్ బలయ్ నిర్వహించారు.ప్రతి ఏటా దసరా మరునాడు అలయ్ బలయ్ కార్యక్రమాన్ని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్వహిస్తున్నారు. అలయ్ బలయ్ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా ప్రముఖులను ఆహ్వానిస్తారు. ఇవాళ నిర్వహించిన కార్యక్రమంలో చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.
మానవత విలువలను మనం పోగోట్టుకోవద్దని చిరంజీవి సూచించారు.మన కుటుంబం నుండే మానవత విలువలను పెంపొందించుకొనేందుకు ప్రయత్నించాలన్నారు. సమాజానికి ప్రేమను ఎంత పంచితే అంత తిరిగి మనకు వస్తుందని చిరంజీవి చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ దిశగా ప్రయత్నం చేయాలని ఆయన కోరారు.
అలయ్ బలయ్ కార్యక్రమానికి తాను రావాలని చాలా కాలంగా అనుకుంటున్నట్టుగా మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. కానీ తనకు అవకాశం రాలేదన్నారు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్, అల్లు అరవింద్ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు. కానీ ఇవాళ తనకు ఈ అవకాశం ఇవాళ దక్కిందన్నారు.
ఒక మంచి సినిమా హిట్ సాధించిన మరునాడే అలయ్ బలయ్ కార్యక్రమంలో తాను పాల్గొనడం పట్ల చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ సంస్కృతిలో భాగంగా ఉన్న అలయ్ బలయ్ కి విస్తృత ప్రాచుర్యం తీసుకు వచ్చిన ఘనత హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకే దక్కుతుందన్నారు.
స్నేహనికి, సుహృద్భావానికి, దాతృత్వానికి ప్రేమను పంచే కార్యక్రమంగా అలయ్ బలయ్ ను చిరంజీవి అభివర్ణించారు. ఇది అద్భుతమైన తెలంగాణ సంస్కృతిగా ఆయన పేర్కొన్నారు. అలయ్ బలయ్ కార్యక్రమం దేశ వ్యాప్తంగా నిర్వహించాల్సిన ఆవశ్యకత ఉందని చిరంజీవి అభిప్రాయపడ్డారు.
also read:మనసులను కలపడమే అలయ్ బలయ్ ఉద్దేశ్యం: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ
దసరా పండుగ తర్వాత తెలంగాణలో జమ్మి ఆకుతో ప్రేమను ఇచ్చిపుచ్చుకొనే సంప్రదాయం అద్భుతమైందన్నారు. ఈ సంస్కృతిని ప్రతిబింబించేలా 17 ఏళ్లుగా బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని కొనసాగించడాన్ని చిరంజీవి ప్రశంసించారు. ఈ కార్యక్రమాన్ని చూసిన తనకు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అనిపించేదన్నారు. చివరకు ఇవాళ ఆ అదృష్టం దక్కిందని చిరంజీవి చెప్పారు.
సినీ పరిశ్రమలో హీరోలంతా కలిసి మెలిసి ఉన్నప్పటికీ అభిమానుల మధ్య అంతరం ఉండేదన్నారు. ఒక హీరో అభిమానులు మరో హీరో అభిమానుల మధ్య పొసగని వాతావరణం ఉండేదన్నారు.ఈ అంతరాన్ని తగ్గించాలని తాను గతంలో ప్రయత్నించినట్టుగా చిరంజీవి గుర్తు చేశారు. తాను నటించిన సినిమా హిట్ అయితేసినీ పరిశ్రమలో ఉన్న తన స్నేహితులఅందరికి పిలిచి పార్టీ ఇచ్చేవాడినన్నారు.
ఈ పార్టీలో అందరితో కలిసి మెలిసి మాట్లాడుకోవడంతో పాటు ప్రేమను ఇచ్చిపుచ్చుకొనే వాళ్లమని చిరంజీవి గుర్తు చేసుకున్నారు.
పార్లమెంట్ లో వాడీ వేడీ చర్చలు జరిగిన సమయంలో కొన్ని సమయాల్లో పరుషమైన పదాలు కూడా ఉపయోగిస్తారన్నారు. తాను ఎంపీగా ఎన్నికైన కొత్తలో పార్లమెంట్ లో జరిగిన చర్చలు చూసి ఇబ్బందిపడ్డానన్నారు. పార్లమెంట్ ముగిసిన తర్వాత చర్చల్లో పాల్గొన్ననేతలు కలిసి కబుర్లు చెప్పుకుంటూ టీ , కాఫీ తాగుతారన్నారు. సిద్దాంతాలు, విధానాల గురించి పార్లమెంట్ లోపల ఏది మాట్లాడినా కూడా పార్లమెంట్ వెలుపల మాత్రం నేతలు స్నేహంగా ఉండేవారని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. ఇదే కదా అలయ్ బలయ్ ప్రభావం అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
అంతకుముందు చిరంజీవి డోలు కొట్టి చిందేశారు. ఇవాళ నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ నటుడు చిరంజీవి, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా అలయ్ బలయ్ లో కళా ప్రదర్శనలు నిర్వహించారు.గవర్నర్ గా బండారు దత్తాత్రేయ బాధ్యతలుచేపట్టిన తర్వాత అలయ్ బలయ్ కార్యక్రమ నిర్వహణ బాధ్యతలను దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి నిర్వహిస్తున్నారు.