చైనీస్ వైరస్ కామెంట్స్... రాజాసింగ్ ను హెచ్చరించిన చైనా

By Arun Kumar P  |  First Published Apr 11, 2020, 12:36 PM IST

కరోనా మహమ్మారిపై గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన కామెంట్స్ పై చైనా స్పందించింది. 


హైదరాబాద్: ప్రపంచ దేశాలను కరోనా వైరస్ అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటికే లక్షమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అమెరికా వంటి బలమైన దేశాన్ని కూడా ఆ వైరస్ వణికిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే కరోనాను చైనా వైరస్ గా సంబోధిస్తున్నారు. ప్రపంచం మొత్తానికి  తెలిసేలా అతడు చేసిన వ్యాఖ్యలపై స్పందించని చైనా అధికారులు భారత్ కు చెందిన ఓ సాధారణ ఎమ్మెల్యే ఇదే  వ్యాఖ్యలు చేస్తే హెచ్చరించింది. 

ఇటీవల ప్రధాని మోదీ పిలుపుమేరకు హైదరాబాద్ గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ కరోనాపై పోరాడుతున్న సిబ్బందికి మద్దతుగా దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ ను చైనీస్ వైరస్ గా పేర్కొన్నాడు. చైనీస్ వైరస్ గో బ్యాక్ అంటూ రాజాసింగ్ చేసిన కామెంట్స్ పై భారత్‌లోని చైనా రాయబార కార్యాలయం స్పందించింది. 

Latest Videos

భారత్‌లోని పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా కౌన్సిలర్‌(పార్లమెంట్‌) లియూ బింగ్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఓ లేఖ రాశారు. ''కరోనా వైరస్‌ గురించి ప్రపంచానికి తెలియజేసిన మొట్టమొదటి దేశం చైనా. అంతేగాని ఈ వైరస్‌ చైనాలోనే పుట్టిందని కాదు. మీరు చైనీస్‌ వైరస్‌ గో బ్యాక్‌ అని చేసిన నినాదాలను తీవ్రంగా ఖండిస్తున్నాం'' అంటూ లేఖలో పేర్కొన్నారు. 

దీనిపై రాజాసింగ్ కూడా దీటుగా జవాభిచ్చారు. '' నా కంటే ముందే చాలామంది కరోనాను చైనీస్ వైరస్ అని పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడిన ప్రతిసారీ చైనీస్ వైరస్ అని పదే  పదే పేర్కొంటున్నారు.  ఇది నిజం కాదంటారా...?'' అని రాజాసింగ్ ప్రశ్నించారు.  

 

click me!