హైదరాబాద్‌లో రెచ్చిపోయిన చైన్‌ స్నాచర్లు.. రెండు గంటల వ్యవధిలో 6 చోట్ల చోరీ..

By Sumanth KanukulaFirst Published Jan 7, 2023, 10:17 AM IST
Highlights

హైదరాబాద్‌లో  చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. దుండగులు జంట నగరాల్లో గంటల వ్యవధిలో 6 చోట్ల చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు.


హైదరాబాద్‌లో  చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. దుండగులు జంట నగరాల్లో రెండు గంటల వ్యవధిలో 6 చోట్ల చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. ఓయూ, ఉప్పల్, నాచారం, రాంగోపాల్ పేట పోలీసు స్టేషన్ల పరిధిలో చైన్ స్నాచింగ్ ఘటనలు చోటుచేసుకున్నాయి. తొలుత ఉప్పల్‌లో ఉదయం 6.20 గంటలకు చైన్ స్నాచింగ్ ప్రారంభం కాగా.. చివరగా ఉదయం 8.10 రామ్‌గోపాల్ పేటలో ముగించారు. ఇందుకోసం దుండగులు ఒక్క పల్సర్ బైక్‌ను వినియోగించారు. బైక్‌ మీద తిగిరుతూ.. ఉప్పల్, కళ్యాణపురి, నాచారం, ఓయూలోని రవీంద్రనగరల్, చిలకలగూడ, రామ్‌గోపాల్ పేట ప్రాంతాల్లో గొలుసు చోరీలకు పాల్పడారు. 

అయితే చోరీలకు దుండగులు వినియోగించు బైక్‌ను దొంగిలించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. చోరీలు చేసే సమయంలో దుండగులు ముఖాలకు మాస్క్‌లు ధరించి ఉన్నారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు నగరంలో తనిఖీలు చేపట్టారు. బాధితులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. ఇక, చోరీల అనంతరం నిందితులు వదలి వెళ్లిన బైక్‌ను రాంగోపాల్ పేట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ ఘటనపై దృష్టి సారించారు. అంతర్రాష్ట్ర దొంగలే ఈ చోరీకి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. దుండగులు చోరీల అనంతరం రైళ్లలో పారిపోయే అవకాశం ఉండటంతో.. నగరంలోని రైల్వే స్టేషన్లలోని సీసీ టీవీలను కూడా పోలీసు బృందాలు పరిశీలిస్తున్నాయి. 
 

click me!