బండి సంజయ్‌ని తరలిస్తున్న వాహనంపై రాళ్ల దాడి.. కామారెడ్డి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత

By Siva KodatiFirst Published Jan 6, 2023, 9:21 PM IST
Highlights

కామారెడ్డి కలెక్టరేట్ వద్ద తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ని తరలిస్తున్న వాహనంపై రాళ్ల దాడి జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. 
 

కామారెడ్డి కలెక్టరేట్ వద్ద మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. బండి సంజయ్ అరెస్ట్‌తో బీజేపీ కార్యకర్తలు హంగామా సృష్టించారు. కలెక్టరేట్ వద్ద బారికేడ్లు ఎత్తేసి లోపలికి దూసుకెళ్లేందుకు యత్నించారు. అదే సమయంలో సంజయ్‌ని తీసుకెళ్తున్న వాహనంపై కొందరు రాళ్లదాడికి పాల్పడ్డారు. బీజేపీ కార్యకర్తలకు , పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. 

ఇకపోతే.. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రైతులు ఆందోళనకు దిగడంతో పాటు ఈరోజు కామారెడ్డి బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో రాజకీయ, రైతు నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. అయితే తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఈరోజు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శించడంతో మరోసారి కామారెడ్డిలో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పాలంటూ బండి సంజయ్ కలెక్టరేట్‌కు భారీ కాన్వాయ్‌తో బయల్దేరారు. ఆయనతో పాటు బీజేపీ కార్యకర్తలు, రైతులు కూడా భారీగా అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్ వద్ద సంజయ్‌ను అరెస్ట్ చేశారు. 

Also REad: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ : తాడో పేడో తేల్చుకుంటానన్న బండి సంజయ్.. కలెక్టరేట్‌ వద్ద అరెస్ట్, ఉద్రిక్తత

అంతకుముందు మాస్టర్ ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ ఆత్మహత్య చేసుకున్న రైతు రాములు కుటుంబాన్ని శుక్రవారం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించి, ఆయన కుటుంబాన్ని ఓదార్చారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. వున్న రెండెకరాలు కూడా ఇండస్ట్రియల్ జోన్‌కు పోతుందున్న ఆవేదనతోనే రైతు రాములు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.

ప్రభుత్వం రైతులతో మొండిగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. ఇండస్ట్రియల్ జోన్‌కు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదని బండి సంజయ్ స్పష్టం చేశారు. రెండు పంటలు పండించే రైతుల పొలాలను గుంజుకోవడం, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొమ్ముకాయడం దీనినే ప్రభుత్వం పనిగా పెట్టుకుందని ఆయన దుయ్యబట్టారు. ఈ ప్రాంతంలో అనేక ప్రభుత్వ భూములు వున్నాయని.. వాటిని ఇండస్ట్రియల్ జోన్‌ కింద తీసుకోవచ్చు కదా అని సంజయ్ ప్రశ్నించారు. 

Also Read: రాజీనామా చేసి .. బీఆర్ఎస్ కండువా కప్పుకో : కామారెడ్డి కలెక్టర్‌పై బండి సంజయ్ తీవ్రవ్యాఖ్యలు

ప్రశ్నించరని, ఎదురు తిరగరనే పేద రైతుల భూములు లాక్కొని వారి పొట్టకొడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. అధికారులు , బీఆర్ఎస్ నేతలు కుమ్మక్కై వారికి అనుకూలంగా మాస్టర్ ప్లాన్ మార్చుకుంటోందని సంజయ్ ఆరోపించారు. ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మాస్టర్‌ప్లాన్‌ను ఎందుకు బయటపెట్టలేదని ఆయన నిలదీశారు. ఇప్పుడు కూడా రైతులు ఆందోళన చేయకుంటే విషయం బయటపడేది కాదని సంజయ్ వ్యాఖ్యానించారు.

click me!