
ఖమ్మం: ఒంటరి మహిళలనే టార్గెట్ గా చేసుకుని కరోనా వ్యాక్సినేషన్ (Corona Vaccine) సర్వే పేరుతో ఇళ్లలోకి వచ్చి దోపిడీకి పాల్పడుతోంది ఓ ముఠా. ఇలా ఖమ్మం జిల్లాలో ఓ మహిళను నమ్మించి మూడు తులాల బంగారాన్ని దోచుకెళ్లారు దుండగులు.
వివరాల్లోకి వెళితే... ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చిన్న పోచారం గ్రామానికి చెందిన వసుమతి(75) ఒంటరిగా జీవిస్తోంది. అయితే గురువారం మద్యాహ్నం ఆమె ఇంటికి కరోనా వ్యాక్సినేషన్ సర్వే పేరుతో కొందరు వచ్చారు. కరోనా వ్యాక్సిన్ వేసుకున్నవారికి ప్రభుత్వం వెయ్యి రూపాయలు ప్రోత్సాహకం అందిస్తుందని చెప్పడంతో ఆమె నిజమేనని నమ్మింది. రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నానని వారికి తెలిపింది.
ప్రభుత్వ ప్రోత్సాహకం అందుకోడానికి మీరు అర్హులే అంటూ వసుమతికి వెయ్యి రూపాయలు ఇచ్చారు. ఈ క్రమంలో ఫార్మాలిటీలో భాగంగా ఓ ఫోటో తీసుకుంటామంటూ ఆమెను కుర్చీపై కూర్చోబెట్టారు. ఇలా కూర్చున్న ఆమె అరవకుండా నోటికి ప్లాస్టర్ వేశారు. ఆమె మెడలోని మూడు తులాల బంగారు గొలుసును దోచుకుని పరారయ్యారు దుండగులు.
read more Warangal Rape Case : అత్యాచారం కేసులో వరంగల్ కార్పొరేటర్ భర్త అరెస్ట్..
ఈ హటాత్పరిణామం నుండి తెరుకున్న వృద్ధురాలు ఇంటిబయటకు వచ్చేసరికి దుండగులు పారిపోయారు. దీంతో స్థానికులకు ఈ విషయం చెప్పగా వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో గ్రామానికి చేరుకున్న పోలీసులు బాధిత మహిళతో మాట్లాడి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
గ్రామంలో ఇలాగే ఒంటరిగా వున్న మరో మహిళ ఇంటికి కూడా వెళ్లిన దుండగులు వ్యాక్సిన్ వేసుకున్నారా అని అడిగినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. దీంతో పక్కాగా రెక్కీ నిర్వహించిన దుండగులు కేవలం ఒంటరి మహిళలనే టార్గెట్ చేసుకున్నారని పోలీసులు గుర్తించారు. ఇలాంటి దోపిడీ ముఠాల పట్ల జాగ్రత్తగా వుండాలని మహిళలకు పోలీసులు సూచించారు.