హుజూరాబాద్, బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ శుక్రవారం నాడు జారీ చేశారు అధికారులు.అక్టోబర్ 30న ఈ రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు.నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరగనుంది.
న్యూఢిల్లీ: తెలంగాణలోని హుజూరాబాద్, (Huzurabad bypoll) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బద్వేల్ అసెంబ్లీ (Badvel assembly bypoll) స్థానాలకు శుక్రవారం నాడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు అధికారులు. ఈ రెండు అసెంబ్లీ స్థానాలకు ఇటీవలనే ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఇవాళ్టి నుండి నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 8వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. అక్టోబర్ 11వ తేదీన నామినేషన్ల స్కూట్నీ నిర్వహిస్తారు. అక్టోబర్ 13న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా నిర్ణయించారు.అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 2 న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్టుగా ఈసీ తెలిపింది.
హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ బరిలోకి దిగుతున్నారు. ఇదే స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోటీలో ఉన్నారు. ఇక బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్ధిగా డాక్టర్ దాసరి సుధ, టీడీపీ అభ్యర్ధిగా ఓబులాపురం రాజశేఖర్ బరిలోకి దిగారు.
హుజూరాబాద్, బద్వేల్ అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలను రెండు రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి.