
హైదరాబాద్: మూడు సాగు చట్టాల(Farm Laws)ను రద్దు చేస్తామని ప్రధాన మంత్రి Narendra Modi చేసిన ప్రకటనలపై రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుల(Farmers) పక్షాన పోరాటానికి నాయకత్వం వహిస్తానని Telangana ముఖ్యమంత్రి KCR ప్రకటించడంతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిందని, అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చట్టాలను రద్దు చేశారని భావిస్తున్నట్టు మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. 40ఏళ్ల అనుభవం కలిగి దీటైన నాయకత్వం వహించే కేసీఆర్ వంటి నేతలు దేశంలో మరెక్కడా లేరని వివరించారు. అందుకే కేంద్ర ప్రభుత్వమే ఆలోచించి ఉంటుందని, ఇంకా రోడ్డున పడటం కంటే ఇప్పుడే నిర్ణయం తీసుకుంటే మంచిదని భావించి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని వివరించారు.
కార్తీక పౌర్ణమి పవిత్ర దినోత్సవం సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ జిల్లా కువరి మండలం, కందికొండ గ్రామంలోని కందగిరి జాతరలో లక్ష్మీ నరసింహ స్వామి, వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె అక్కడే మీడియాతో మాట్లాడారు. మూడేళ్ల క్రితం ఈ నియోజకవర్గ ఎన్నికల కోసం వచ్చిన కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని, నలుమూలల సాగు నీరు అందిస్తానని ఆ హామీ నిజం చేశారని వివరించారు. వేసవిలోనూ మత్తెడ దూకుతున్నాయంటే కారణం కేసీఆర్ నిర్ణయాలేనని పేర్కొన్నారు.
అనంతరం సాగు చట్టాల గురించి మాట్లాడారు. సంవత్సరం కింద తెచ్చిన సాగు చట్టాలు రైతులను ఆందోళనలకు గురి చేశాయని అన్నారు. ఏడాది కాలంగా పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల నుంచి రైతులు ఢిల్లీలో ఉద్యమాలు చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని వివరించారు. ఈ చట్టాల వల్ల సన్నకారు, చిన్నకారు రైతులకు అన్యాయం జరుగుతుందని, కార్పొరేట్ సంస్థలకే మేలు జరుగుతుందని చెప్పినా.. వాటిని ఉపసంహరించుకోవాలని ప్రధాని మోడీని అడిగినా ఆయన ఒప్పుకోలేదని తెలిపారు. అనాలోచితంగా తెచ్చిన చట్టాలను ఆలోచించిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ మహాధర్నా చేసిందని వివరించారు. అవసరమైతే దేశంలో రైతుల పక్షాన పోరాటానికి నాయకత్వం వహిస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో కేంద్ర ప్రభుత్వానికి వణుకుపుట్టిందని పేర్కొన్నారు.
రైతుల సమస్యలపట్ల చిత్తశుద్ధి, ఆలోచనలు లేకపోవడం ఈ నిర్ణయానికి నిదర్శనమని కేంద్రంపై విమర్శలు కురిపించారు. కానీ, దీర్ఘకాల పోరాటంతో రైతులు ఈ రోజు సాధించిన విజయం ఇది అని వివరించారు. అయితే, ఈ విజయానికి టీఆర్ఎస్ పునాదులు వేసిందని భావిస్తున్నట్టు పేర్కొన్నారు.
Also Read: ఆత్మహత్యలు చేసుకోవద్దు.. జాబ్ నోటిఫికేషన్స్ పైనే తొలి సంతకం.. వైఎస్ షర్మిల..!
కేసీఆర్‌కు కేంద్రం మెడలు వంచడం వెన్నతో పెట్టిన విద్య అని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ పోరాటం ఎన్నో విధాలుగా నీరుగారుస్తున్నా కేసీఆర్ వెనుకంజ వేయలేదని పేర్కొన్నారు. అప్పుడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వచ్చి ప్రత్యేక తెలంగాణ సాధించారని వివరించారు. ఇప్పుడు రైతుల పక్షాన ధర్నాకు దిగగానే కేంద్రం ఆలోచనలో పడిందని, ఇంకా రోడ్డున పడటం ఎందుకని భావించే మూడు సాగు చట్టాలను రద్దు చేసి ఉంటుందని తాను భావిస్తున్నట్టు వివరించారు.
ఈ రోజు ఉదయం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జాతినుద్దేశించి మాట్లాడుతూ మూడు సాగు చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించారు.