
తెలంగాణలో జిల్లాలు ఎక్కువగా ఉన్నాయని, దీని వల్ల సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులను కేటాయించలేమని అందువల్ల జిల్లాలను కుదించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం కోరిందని నిన్నటి వరకు సోషల్ మీడియాలో వార్తలు వెలువడ్డాయి.
అయితే ఈ వార్తలు అవాస్తవమని తేలింది. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత చాలా ప్రతిష్టాత్మకంగా జిల్లాల పునర్ వ్యవస్థీకరణ చేపట్టారు.
పరిపాలనా సౌలభ్యం కోసం, ప్రభుత్వ పథకాలు ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు వీలుగా 10 జిల్లాలను ఏకంగా 31 జిల్లాలకు పెంచారు.
అయితే సోషల్ మీడియాలో జిల్లాల కుదింపు వార్తలు రావడంతో చాలా మంది అవాక్కైయ్యారు. ఈ విషయం కేంద్ర ప్రభుత్వం వరకు వెల్లడంతో దీనిపై వారు స్పందించాల్సి వచ్చింది.
తెలంగాణలో ప్రస్తుతం ఉనికిలో ఉన్న 31 జిల్లాలను కుదించాలని రాష్ర్టానికి లేఖ రాసినట్లు వస్తున్న వార్తలన్నీ నిరాధారమైనవని కేంద్ర హోంమంత్రిత్వశాఖలోని కేంద్ర-రాష్ట్ర సంబంధాల విభాగం(సీ-ఎస్), రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ (ఎస్‌ఆర్) విభాగాలకు చెందిన అధికారులు స్పష్టం చేశారు.
ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వానికి కొత్త జిల్లాల సంఖ్యను కుదించాల్సిందిగా ఎలాంటి లేఖను పంపలేదని తెలిపారు.
దీంతో జిల్లాల కుదింపు వార్తలకు తెరపడినట్లైంది.