తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో జరిగిన నష్టంపై కేంద్ర మంత్రికి బృందం నివేదికను అందించనుంది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని భారీ వర్షాలు, వరదలతో జరిగిన నష్టంపై కేంద్ర బృందం శుక్రవారంనాడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు నివేదిక ఇవ్వనుంది. ఈ నెల 1వ తేదీ నుండి మూడో తేదీ వరకు రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటించింది. ఈ బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి జరిగిన నష్టాన్ని అంచనా వేసింది. ఈ ఏడాది జూలై మాసంలో తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 60 సెం.మీ . వర్షపాతం నమోదైంది. అసాధారణ వర్షపాతం నమోదు కావడంతో ఆస్తి, ప్రాణ నష్టం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలతో జరిగిన నష్టాన్ని కేంద్ర బృందం అంచనా వేసింది.
మూడు రోజుల పాటు క్షేత్రస్థాయి పరిశీలన చేసిన కేంద్ర బృందం ఈ నెల 3వ తేదీన తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో సమావేశమయ్యారు.కేంద్ర బృందంలో ఏడు శాఖలకు చెందిన అధికారులున్నారు.
వరంగల్, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటించింది. . ఈ ప్రతినిధి బృందానికి జాతీయ విపత్తుల నిర్వహణ శాఖ జాయింట్ సెక్రటరీ కునాల్ సత్యార్థి నేతృత్వం వహించారు. భారీ వర్షాలకు ఐదు జిల్లాల్లో రహదారులు, వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆయన చెప్పారు. అంతేకాదు వీటితోపాటు వరితోపాటు పలు పంటలు పూర్తిగా ధ్వంసమయ్యాయని కేంద్ర బృందం అభిప్రాయపడింది.
also read:వరద ప్రభావిత ప్రాంతాల్లో 18 బోట్లతో రెస్క్యూ: ఫైర్ శాఖ డీజీ నాగిరెడ్డి
ప్రధానంగా మోరంచపల్లి, కొండాయి గ్రామాలూ పూర్తిగా నీటమునిగి ఆస్తి నష్టం కలిగిన విషయాన్ని కేంద్ర బృందం తెలిపింది. ఈ ఐదు జిల్లాల కలెక్టర్లు చేపట్టిన ముందు జాగ్రత్త చర్యలవల్ల భారీగా ఆస్తి, ప్రాణ నష్టం తగ్గిందని కేంద్ర బృందం అభిప్రాయపడింది.మూడు రోజుల పాటు ఆయా జిల్లాల్లోని జరిగిన నష్టంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కేంద్ర బృందం నివేదికను అందించనుంది.