హత్యకు కుట్ర.. కేంద్రం అలర్ట్, ఈటల రాజేందర్‌కు ‘‘ వై కేటగిరీ’’ భద్రత..?

By Siva KodatiFirst Published Jun 27, 2023, 8:33 PM IST
Highlights

తన భర్త హత్యకు కుట్ర జరుగుతోందన్న ఈటల జమున వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు వై కేటగిరీ భద్రత కల్పించనుంది

హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పించనుంది. ఆయనను హతమార్చేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో ఈటలకు ‘‘వై కేటగిరీ’’ భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒకటి రెండు రోజుల్లోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం వుందని తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ తన కథనం పేర్కొంది. 

అంతకుముందు ఈటల రాజేందర్  సతీమణి ఈటల జమున సంచలన ఆరోపణలు చేశారు. ఈటల రాజేందర్‌ను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈటల రాజేందర్‌ను రూ. 20 ఇచ్చి కోట్లు చంపిస్తానని కౌశిక్ రెడ్డి అంటున్నారని ఆరోపణలు చేశారు. ఈటల రాజేందర్‌ను చంపిస్తామంటే తాము భయపడమని తెలిపారు. తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు.. నయీం వంటి వ్యక్తులు బెదిరిస్తేనే భయపడలేదని చెప్పారు. కౌశిక్ రెడ్డి మాటల  వెనక కేసీఆర్ ఉన్నారని ఈటల జమున ఆరోపించారు. ఇలాంటి ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు అవసరమా? అని  ప్రశ్నించారు. ఆయనకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్లను రూ. 20 కోట్లు ఇచ్చి చంపిస్తారా? అని ప్రశ్నించారు. ఇలాంటి కేసీఆర్‌కు రానున్న ఎన్నికల్లో ప్రజలు ఓటుతో బుద్ది చెబుతారని అన్నారు. 

Also Read: ఈటల రాజేందర్‌ను హత్య చేసేందుకు కుట్ర.. : జమున సంచలన ఆరోపణ

తమ మీద అక్కసుతోనే కౌశిక్ రెడ్డిని కేసీఆర్ ఎమ్మెల్సీ చేశారని జమున ఆరోపించారు. హుజురాబాద్‌లో కౌశిక్ రెడ్డి శాడిస్టులా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ప్రోత్సహంతోనే కౌశిక్ రెడ్డి చెలరేగిపోతున్నాడని.. హుజురాబాద్ ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని అన్నారు. సర్పంచ్ మహేందర్ గౌడ్ ఏం చేయకపోయినప్పటికీ జైలులో కౌశిక్ రెడ్డి వేయించాడని.. కొట్టేది ఆయనకు చూపించాలని పోలీసులకు  చెప్పాడని.. ఈ విధంగా శాడిస్టులా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు.  

గవర్నర్‌పై కూడా కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని జమున అన్నారు. అమరవీరుల స్థూపాన్ని కౌశిక్ రెడ్డి కూలగొట్టించాడని.. శిలాఫలకం మీద ఈటల రాజేందర్ పేరు ఉండొద్దనే కేసీఆర్ చెప్పాడని ఈ పని చేశాడని ఆరోపించారు. కౌశిక్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడు కాదని.. ఆ సమయంలో ఉద్యమకారులను కొట్టించాడని ఆరోపించారు. అమరవీరుల స్థూపాన్ని కూడా తాకే అర్హత కౌశిక్ రెడ్డికి లేదని అన్నారు. ఉద్యమకారులను గౌరవించని వ్యక్తికి ఎమ్మెల్సీగా ఉండే అర్హత లేదని.. కౌశిక్ రెడ్డిని  ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్  చేశారు. 

click me!