అతివేగం వల్ల జరిగిన కారు ప్రమాదం వల్ల ఇద్దరు మృత్యువాత పడ్డ ఘటన మొయినాబాద్ మండలంలో జరిగింది. కారు బస్సు కిందికి దూసుకుపోయి మృతదేహాలు నుజ్జు నుజ్జయ్యాయి.
హైదరాబాద్ : అతివేగం, అజాగ్రత్త... మూలమలుపు ఇద్దరి కుటుంబాల్లో క్షొభను మిగిల్చింది. మరో అరగంటకు గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన యువతీ, యువకుడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. శనివారం రాత్రి మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ ఘాట్ రోడ్డు వద్ద పెరిగిన ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న ప్రమాదానికి అతి వేగమే... కారణమని పోలీసులు తేల్చారు. ఏపీలోని ఏలూరు జిల్లా ములకలపల్లి చెందిన ఎస్ కళ్యాణి (22) తండ్రి సత్యనారాయణ కొన్నాళ్ల క్రితమే మృతి చెందారు. ముగ్గురు కుమార్తెలలో చిన్నకుమార్తె కళ్యాణి నగరం లోని పంజాగుట్టలో ఉన్న ఫార్మా కార్యాలయంలో ఉద్యోగం చేస్తూ ఎస్ ఆర్ నగర్ లో నివాసం ఉంటుంది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ళకు చెందిన రాజేష్ కుమార్ (26), సైతం ఎస్ఆర్ నగర్లో నివాసం ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు.
ఒకే కాలనీలో ఉంటుండడంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. వారాంతంలో సరదాగా లాంగ్ డ్రైవ్ కు వెళ్లేందుకు కారు అద్దెకు తీసుకుని బయలుదేరారు. చేవెళ్ల నుంచి తిరిగి తమ ఇంటికి వెళుతుండగా ..మధ్యలోని ఆదిత్య నగర్ పాత రోడ్డు వద్ద కారు వేగంగా వేళ్తూ.. అదుపుతప్పి రహదారి డివైడర్ను ఢీ కొట్టుకుంటూ కుడివైపు వెళ్ళింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీ కొట్టడంతో కారులో ఉన్న రాజేష్ కుమార్ తో పాటు కళ్యాణి అక్కడికక్కడే మృతి చెందారు. కారు ముందు భాగం పూర్తిగా బస్సు కిందికి దూసుకుపోవడంతో మృతదేహాలు సైతం నుజ్జు నుజ్జు అయ్యాయి. క్రేన్ సహాయంతో బస్సు కింద ఇరుక్కుపోయిన కారును బయటకి లాగి మృతదేహాలను బయటకు తీయాల్సి వచ్చింది. ఉస్మానియాలో పోస్టుమార్టం చేయించి మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించినట్లు ఇన్స్పెక్టర్ డీకే లక్ష్మీరెడ్డి తెలిపారు.