
ప్రపంచానికి శాంతిని బోధించిన బుద్ధుడు ఒక్కడే.. కానీ, బౌద్ధ శాఖలు అనేకం.. బౌద్ధం పుట్టిన మన దేశంలో ఆ మతస్తులు పెద్దగా లేకపోయినా.. బుద్ధున్ని స్మరిస్తూ నాటి రాజులు నిర్మించిన కట్టడాలు ప్రతిచోట దర్శనమిస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో మహాయాన, వజ్రాయాన బౌద్ధం ఒక వెలుగు వెలిగింది. అమరావతి, ఫణిగిరి, నేలకొండపల్లి, నాగార్జునకొండ తదితర ప్రాంతాల్లో బౌద్ధమతం గొప్పగా వెలసిల్లింది.
ఇప్పుడు ఈ చరిత్ర అంతా ఎందుకంటే.. శిథిలమైపోతున్నా ఈ చారిత్రక క్షేత్రాలను సంరక్షించి పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దేందుకు తెలుగు రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి.
కమ్యూనిజం, సోషలిజం ఇలా అన్ని ఇజాల కంటే టూరిజమే గొప్పదని ఏపీ సీఎం చంద్రబాబు ప్రగాఢ నమ్మకం.. అందుకే ఆయన నవ్యాంధ్ర ప్రదేశ్ ను టూరిజం కేంద్రంగా మార్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా బౌద్ధ ప్రాంతాలను అభివృద్ధి పరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే, కాల చక్ర ను మరోసారి భారీ స్థాయిలో నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ విషయంలో తెలంగాణ కూడా ఏపీకి పోటీకి వస్తుంది. తెలంగాణ స్టేడ్ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ బౌద్ధ క్షేత్రాలను పర్యాటక ప్రదేశాలుగా అభివృద్ధి పరిచేందుకు సిద్ధమైంది.
బౌద్ధ మతస్తులు అత్యధికంగా ఉండే దక్షిణాసియా దేశాల ప్రజలను ఆకర్షించేందుకు ఈ కొత్త ప్రణాళికను సిద్ధం చేసింది. బుద్ధ టూరిజమ్ పేరుతో అంతర్జాతీయంగా బుద్ధ దమ్మను రాష్ట్రంలో నిర్వహించనుంది. ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.
శ్రీలంక, మలేసియా, చైనా, తైవాన్, సింగపూర్, బర్మా, జపాన్, ఇటలీ, ఇండోనేషియా తదితర దేశాలకు చెందిన బౌద్ధిస్టులు ఈ బుద్ధ దమ్మలో పాల్గొంటారు. మంగళవారం దీనికి సంబంధించి టిఎస్ టిడిసి చైర్మన్ పేర్వారం రాములు, టిఎస్ టిడిసి ఎండి క్రిస్టియానా, బుద్ధవనం ప్రత్యేక అధికారి మాలేపల్లి లక్ష్మయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇలా రెండు రాష్ట్రాల్లు బుద్దుడిని టూరిజమ్ కోసం బాగానే వినియోగించుకుంటున్నాయన్నమాట.