కేవలం బీర్ బాటిల్స్ కోసం ఓ యువకుడిని నలుగురు ఆకతాయిలు అతి దారుణంగా హత్యచేసిన ఘటన హైదరాబాద్ శివారులో వెలుగుచూసింది.
హైదరాబాద్ : కేవలం బీర్ బాటిల్స్ కోసం కొందరు ఆకతాయి యువకులు దారుణానికి ఒడిగట్టారు. ఓ యువకుడి వద్దగల బీర్ బాటిల్స్ దొంగిలించేందుకు ప్రయత్నించిన దుండగులు కత్తులతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. దీంతో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ శివారులో పట్టపగలే ఈ దారుణం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా మీర్ పేట ప్రాంతంలో నివాసముండే సాయి వరప్రసాద్ బీర్లు తాగాలని అనుకున్నాడు. వెంటనే జిల్లెలగూడలోని ఓ వైన్ షాప్ కు వెళ్లి బీర్లు కొనుగోలు చేసాడు. బీర్లు పట్టుకుని వెళుతున్న సాయిని స్థానిక స్వాగత్ హోటల్ వద్ద నలుగురు యువకులు అడ్డుకున్నారు. బీర్ బాటిల్స్ తమకు ఇచ్చి వెళ్లిపోవాలని ఆ ఆకతాయి గ్యాంగ్ డిమాండ్ చేసింది. అందుకు సాయి ఒప్పుకోకపోవడంతో రోడ్డుపైనే అందరూ చూస్తుండగా దాడికి దిగారు. సాయి వరప్రసాద్ ను చుట్టుముట్టిన దుండగులు కత్తులతో ఎక్కడపడితే అక్కడ పొడిచారు. రక్తపుమడుగులో పడిపోయిన సాయి వద్దగల బీరు బాటిల్స్ తీసుకుని అక్కడినుండి వెళ్లిపోయారు.
దుండగుల చేతిలో కత్తిపోట్లకు గురయి ప్రాణాపాయస్థితిలో పడివున్న సాయి వరప్రసాద్ స్నేహితులు దగ్గర్లోని ఓ హాస్పిటల్ కు తరలించారు. కానీ వెంటనే వైద్యం అందించి ప్రాణాలు కాపాడకుండా వైద్యసిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇలా సమయానికి వైద్యం అందక సాయి వరప్రసాద్ ప్రాణాలు కోల్పోయాడు.
ఈ దారుణ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సాయి వరప్రసాద్ మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. అతడిని దాడిచేసింది పల్లె నతీష్ గౌడ్, కిరణ్ గౌడ్, సంతోష్ యాదవ్, పవన్ లుగా గుర్తించారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ప్రాణాపాయ స్థితిలో చికిత్స కోసం వచ్చిన యువకుడికి వైద్యం అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన హాస్పిటల్ పై కూడా కేసు నమోదు చేసారు పోలీసులు.