హైదరాబాద్ లో ఓ వ్యక్తిపై దాడి ఘటనకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు సుమోటోగా స్వీకరించారు.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోఓ బిఆర్ఎస్ కార్యకర్త తన అనుచరులతో కలిసి వీరంగం సృష్టించాడు. కర్రతో ఓ వ్యక్తిపై అమానుషంగా దాడి చేశారు. ఈ దాడిలో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో విషయం వెలుగు చూసింది. ఈ ఘటన రెండు రోజుల క్రితం జరిగిందని తేలింది. దీనిని జూబ్లీహిల్స్ పోలీసులు సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలనుకుంటున్నారు. దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే..
భాస్కర్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి యూసుఫ్ కూడా కృష్ణనగర్ లో ఓ వ్యక్తిని దారుణంగా కొట్టాడు. అతను ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తే. మంగళవారం నాడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది పోలీసులకు కూడా చేరింది. అయితే దీనిమీద ఎవరు ఫిర్యాదు చేయలేదు. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు ఈ వీడియోను సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయనున్నట్లు సమాచారం. ఈమేరకు జూబ్లీహిల్స్ ఏసీబీ హరిప్రసాద్ తెలిపారు.
రాహుల్ గాంధీ భ్రమలో జీవిస్తున్నారు.. కాంగ్రెస్ పై ఎమ్మెల్సీ కవిత ఫైర్
భాస్కర్ అతని స్నేహితుల దాడిలో గాయపడ్డ వ్యక్తి ఎవరు అనే విషయాలు తెలియలేదు. దీనికి సంబంధించి మరో వాదన కూడా వినిపిస్తుంది. బాధితుడు ఓ సైకో అని అతను మొదట భాస్కర్ మీద దాడి చేశాడని.. దీంతో భాస్కర్ గాయపడ్డాడంతో ప్రతిదాడి చేశాడని చెబుతున్నారు. అతని దాడిలో భాస్కర్ తలకు గాయమయ్యింది. అతను గాంధీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. దీని మీద జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ.. ఎవరైనా సరే హద్దులు దాటి ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోక తప్పదని.. పోలీసులకు తెలిపారు.