బీఆర్ఎస్ వర్సెస్ టీఆర్ఎస్.. పేరు మార్పుతో ప్రజలకు దూరమయ్యారా? 

By Rajesh Karampoori  |  First Published Jan 13, 2024, 3:41 AM IST

BRS vs TRS: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కాంక్షను నెరవేర్చేందుకు ఆవిర్భవించిన ఉద్యమపార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)..  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత అనూహ్యంగా తెరాస పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీగా మారిపోయింది. గత పదేళ్లపాటు తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్రను వేసుకున్న టీఆర్ఎస్.. జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పాలని భావిస్తోంది. ఈ క్రమంలో తన పేరును మార్చుకుంది. కానీ.. పేరు మార్పుతో ప్రజలకు దూరమయ్యామనే భావన ఆ పార్టీ నేతల్లోనే ఉంది.


BRS vs TRS: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటమి పాలుకావడంతో మరోసారి 'బీఆర్ఎస్' పేరు చర్చనీయాంశమైం ది. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్న నాటి నుంచి పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇతర పార్టీల నేతలు కూడా పార్టీ పేరు మార్పుపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడంతోనే  ఆ పార్టీకి తెలంగాణతో బంధం తెగిపోయిందని బాహాటంగానే చెప్తూ వస్తున్నారు. అయితే తాజాగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మరోసారి పార్టీ పేరు మార్పునకు సంబంధించి చర్చ మొదలైంది. అగ్రనేతలే పార్టీ అధిష్టానానికి సూచించే స్థాయికి చేరడం చర్చనీయాంశమైంది.

'భారత్ రాష్ట్ర సమితి'ని తిరిగి 'తెలంగాణ రాష్ట్ర సమితి'గా మార్చాలని పార్టీ శ్రేణులు అధిష్టానాన్ని కోరుతున్నారట. లోక్ సభ ఎన్నికలు రాబోతుండగా.. సన్నాహక సమావేశాల్లో జిల్లాల నుంచి వచ్చిన పార్టీ నాయకులు ఇదే అంశాన్ని ప్రస్తావించారు. మరోవైపు.. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి విశ్లేషణలను కొనసాగిస్తూనే.. పార్టీ నాయకులు టీఆర్ఎస్ ను తిరిగి ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుతున్నారు.

Latest Videos

"సెంటిమెంటుకు దూరం "..

వాస్తవానికి టీఆర్ఎస్ ఉద్యమపార్టీ.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆస్థిత్వాన్ని, స్వాభిమానాన్ని కాపాడిన పార్టీగా టీఆర్ఎస్ కు పేరుంది. ఇలాంటి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమపార్టీ పేరు నుంచి తెలంగాణ అనే పేరు తొలగించడంతో .. ప్రజలకు దూరమైన భావన ఏర్పడిందనే చెప్పాలి. ఇప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరా పరాజయం ఎదుర్కొంటున్న గులాబీ పార్టీ.. రానున్న రోజుల్లో ఓటర్లకు మరింత దూరమయ్యే ప్రమాదం ఉందని, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి అది కూడా ఓ కారణమని కార్యకర్తలు చెప్తున్నారు. 

పేరు మార్పు తర్వాత అంతగా కలిసిరాలేదనే భావన కూడా పార్టీ శ్రేణుల్లో లేకపోలేదు. గులాబీ పార్టీ డై హార్ట్ ఫ్యాన్ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఒకవేళ టీఆర్ఎస్ ను జాతీయస్థాయిలోకి తీసుకెళ్తే.. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ గానే ఉంచి, రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం'టీఆర్ఎస్'ను తెర మీదకు తీసుకురావాలని పలువురు కార్యకర్తలు సూచిస్తున్నారు. ఈ మేరకు న్యాయపరమైన అంశాలేమైనా ఉంటే నిపుణులతో పార్టీ పెద్దలు చర్చిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. గులాబీ బాస్ కేసీఆర్ దృష్టి ఈ విషయాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని పార్టీ పెద్దలు కూడా భావిస్తున్నారంట. ఈ అంశంపై గులాబీ అధిష్టానం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

click me!