KTR: బీఆర్ఎస్ను గెలిపించుకోక ప్రజలు తప్పు చేశారని అనడం సరికాదన్నారు బిఆర్‌ఎస్వ ర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు(KTR). ప్రజలపై కామెంట్స్ చేయొద్దని పార్టీ నేతలకు సూచించారు.
KTR: భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తారు. దశాబ్దం పాటు నిరంతరాయంగా పనిచేసిన కారు (బిఆర్‌ఎస్) సర్వీసింగ్ కు వెళ్లింది. షెడ్డుకు కాదు. ప్రస్తుతం సర్వీస్ చేయబడుతోంది. సర్వీసింగ్ తర్వాత అధిక వేగంతో వెళ్తుందని కేటీఆర్ అన్నారు. శుక్రవారం నాడు భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంలో లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో కేటీఆర్ ప్రసంగిస్తూ.. అసెంబ్లీ ఎన్నికల ఓటమిని 'స్పీడ్ బ్రేకర్'గా అభివర్ణించారు. రానున్న లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విజయఢంకాను మోగిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
కేటీఆర్ తన ప్రసంగంలో బీఆర్ఎస్‌ను గెలిపించుకోక ప్రజలు తప్పు చేశారని అనడం సరికాదన్నారు. ప్రజలపై కామెంట్స్ చేయొద్దని, గత విజయాలు,రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రజల మద్దతును గుర్తు చేశారు. ఓటమికి ప్రజలను నిందించడం మానుకోవాలని BRS కార్యకర్తలకు సూచించారు. ఓటమికి తానే పూర్తి బాధ్యత వహిస్తాననీ, బీఆర్‌ఎస్‌ను ప్రజలు పూర్తిగా తిరస్కరించలేదని, ఆ పార్టీ 39 స్థానాల్లో గెలుపొందడం ఆ విషయాన్ని తెలియజేస్తోందని అన్నారు.
ఎన్నికల ప్రచార సమయంలో ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చినప్పటికీ ఊహించని ఫలితాలు వచ్చాయని, అందుకు గల కారణాలను పార్టీ విశ్లేషిస్తుందని ఆయన అన్నారు. నియోజక వర్గాల్లో ఎమ్మెల్యే కేంద్రంగా సాగుతున్న కార్యకలాపాలు కూడా సరిగా లేదన్నారు. కార్యకర్తల ఆర్థిక స్థిరత్వంపై పార్టీ దృష్టి పెట్టలేదనీ, పార్టీ కార్యకర్తల ప్రమేయం లేకుండానే ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేరాయనీ, దీంతో ఓటరుకు కార్యకర్తలకు మధ్య బంధం తెగిపోయిందని ఆయన అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఆరు లక్షల రేషన్ కార్డులు, 15,000 కొత్త ఆసరా పెన్షన్‌లను అందించింది. చాలామంది దళిత బంధు ప్రయోజనాలను పొందారనీ, కానీ పార్టీ దానిని సరిగ్గా ప్రచారం చేయడంలో విఫలమైందని అన్నారాయన.