
ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. సోమవారం రోజున బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఒకరిపై ఒకరు కత్తులతో దాడులు చేసుకున్నారు. తాజాగా ఈరోజు బీఆర్ఎస్‌కు చెందిన సర్పంచ్ వర్గంపై దాడి జరిగింది. కాంగ్రెస్ నేతలే ఈ దాడి చేశారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో గత రెండు రోజులుగా పండితాపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
వివరాలు.. ఆదివారం ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ జనగర్జన సభ నిర్వహించింది. ఈ సభకు పండితాపురం నుంచి భారీగా కాంగ్రెస్ శ్రేణులు తరలివెళ్లారు. అయితే ఈ సభ సందర్భంగా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ర్యాలీని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ నేతలు ప్రయత్నం చేశారు. దీంతో ఆ సమయంలో ఇరువర్గాల మధ్య వివాదం చోటుచేసుకుంది. అప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు వెనక్కితగ్గారు. అయితే సోమవారం సాయంత్రం కాంగ్రెస్ కార్యకర్తల ఇంటిపై దాడి జరిగింది. ఈ ఘటనలో గాయపడిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలను ఖమ్మంలోని ఆస్పత్రులకు తరలించారు. కాంగ్రెస్ కార్యకర్తలపై దాడి వెనక బీఆర్ఎస్ కార్యకర్తలే ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తాజాగా మంగళవారం బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి జరగగా.. ఇద్దరికి గాయాలు అయ్యాయి. దీంతో వారిని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ దాడి వెనక కాంగ్రెస్ హస్తం ఉందని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఇక, పండితాపురంలో వరుస ఘటనల నేపథ్యంలో గ్రామానికి పోలీసు బలగాలు చేరుకుంటున్నాయి.