బిఆర్ఎస్ పార్టీలో కల్వకుంట్ల కుటంబసభ్యులకు తప్ప బయటి నాయకులకు ఎలాంటి ప్రాధాన్యత వుండదనే అపవాదు నుండి బయటపడేందుకు అధినేత కేసీఆర్ సరికొత్త ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ రాజకీయాలను తారుమారు చేసాయి. విజయం సాధించి ప్రతిపక్షం అధికారపక్షంగా... ఓటమిపాలై అధికారపక్షం ప్రతిపక్షంగా మారాయి. కానీ ఈ రెండు పక్షాలు ప్రస్తుతం సంధిగ్దావస్థలో వున్నాయి. నూతన ముఖ్యమంత్రిని నిర్ణయించేందుకు కాంగ్రెస్ పార్టీ తర్జనభర్జన పడుతుండే బిఆర్ఎస్ లోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. బిఆర్ఎస్ ఎల్పీ నేతగా ఎవరయితే బావుంటుంది? ఎవరిని నియమిస్తే ఎలాంటి పరిణామాలు వుంటాయి? అన్నదానిపై ఇప్పటికే అధినేత కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించారు. అయినా బిఆర్ఎస్ ఎల్పీ నేత ఎవరన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.
బిఆర్ఎస్ పార్టీలో బయటి నాయకులకు ఎలాంటి ప్రాధాన్యత వుండదు... కల్వకుంట్ల కుటుంబసభ్యులు ఎంత చెబితే అంతే. అధినేత కేసీఆర్... లేదంటే ఆయన తనయుడు కేటీఆర్... కాకుంటే మేనల్లుడు హరీష్ రావు... అలాగే కూతురు కవిత... వీరెవరూ కాదంటే సంతోష్ రావు... బిఆర్ఎస్ లో కీలక నాయకులు వీళ్లే. గత రెండు పర్యాయాలు ప్రభుత్వంలోనూ వీరికే కీలక బాధ్యతలు, పదవులు దక్కాయి. ఇదే ఈసారి బిఆర్ఎస్ కొంప ముంచిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కల్వకుంట్ల కుటుంబ పాలన ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది... దీన్ని ప్రజలకు వివరించి సక్సెస్ అయ్యారుకూడా.
Read More కేసీఆర్ : తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎవరు?...
అధికారంలో వున్నపుడూ అన్ని బాగానే కనిపించాయి... కానీ ఒక్క ఓటమితో బిఆర్ఎస్ నాయకత్వానికి అసలు విషయం బోధపడింది. దీంతో కల్వకుంట్ల కుటుంబ ఆధిపత్యం అనే భావనను ప్రజల మెదడులోంచి చెరిపివేసేందుకు బిఆర్ఎస్ అధినేత కసరత్తు చేస్తున్నారట. ఇందులో భాగంగానే ప్రతిపక్షంలో కీలకమమైన బిఆర్ఎస్ ఎల్పీ బాధ్యతలను తన కుటుంబసభ్యులకు కాకుండా పార్టీలోని సీనియర్లలో ఎవరో ఒకరికి ఇవ్వాలన్న భావనలో కేసీఆర్ వున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే గెలిచిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు ముఖ్య నాయకులతో కేసీఆర్ చర్చించారు.
తెరపైకి కడియం పేరు :
బిఆర్ఎస్ ఎల్పీ నేతగా మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పేరును కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని లేదంటే దళిత సామాజికవర్గానికి చెందిన భట్టి విక్రమార్కను ముఖ్యమంత్రిని చేయాలని చూస్తోంది. ఒకవేళ భట్టిని సీఎంగా చేస్తే దళిత వర్గాలు కాంగ్రెస్ కు పూర్తిగా దగ్గరవుతాయి. ఇప్పటికే దళిత సీఎం హామీని నెరవేర్చలేదని కేసీఆర్ పై దళిత వర్గాలు గుర్రుగా వున్నారు... ఈ విషయం తాజా ఎన్నికల్లో బయటపడింది. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ ఓటమిని చవిచూడటమే దళితుల్లో బిఆర్ఎస్ పై ఎంతటి వ్యతిరేకత వుందో తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలో దళిత నాయకుడే కాదు బాగా సీనియర్ అయిన కడియం శ్రీహరిని బిఆర్ఎస్ ఎల్పీ నేతగా చేసి దిళితుల్లో బిఆర్ఎస్ పై వున్న వ్యతిరేకత కాస్తయినా తగ్గించుకోవాలన్నది కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తోంది.
ఒకవేళ భవిష్యత్ రాజకీయాలే కీలకం అనుకుంటే తన తనయుడు కేటీఆర్ ను బిఆర్ఎస్ ఎల్పీ నేతగా కేసీఆర్ నియమించే అవకాశాలున్నాయి. ఈసారి బిఆర్ఎస్ గెలిస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి చేయాలని కేసీఆర్ భావించారు... అది జరగలేదు కాబట్టి ప్రతిపక్ష నేతగా తనయుడికి బాధ్యతలు అప్పగించాలనే మరో ఆలోచన కేసీఆర్ కు వుందట. పార్టీపై పట్టు జారకుండా వుండేదుకే కాదు కొడుకును మరింత ప్రమోట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో కేటీఆర్, కడియం శ్రీహరి లలో ఎవరయితే బిఆర్ఎస్ ఎల్పీ నేతగా బావుంటుంది? అంటూ అందరు ఎమ్మెల్యేల వద్ద కేసీఆర్ అభిప్రాయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.