Sammakka Sarakka Central Tribal University :తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో కూడా ఈ వర్సిటీ ఏర్పాటు చేయాలని ఉంది. ఈ రెండు హామీల ప్రకారం గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేసేందుకు వీలుగా లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం తాజాగా లోక్ సభలో బిల్లును ప్రవేశపెట్టింది.
Tribal Varsity : ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు విడిపోయిన సమయంలో విభజన చట్టంలో భాగంగా ఇచ్చిన ఓ హామీ త్వరలోనే అమలు కాబోతోంది. తెలంగాణ ఎంతో ఎదురుచూస్తున్న సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం కల సాకారం కాబోతోంది. ఇటీవల ప్రధాని మోడీ కూడా తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ ఇస్తానని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే తెలంగాణలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం లోక్ సభలో ప్రవేశపెట్టారు.
కేంద్రీయ విశ్వవిద్యాలయాల (సవరణ) బిల్లు, 2023 ప్రకారం.. సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ స్థాపించడం వల్ల రాబోయే కాలంలో ప్రాంతీయ ఆకాంక్షలను నెరవేరుస్తుంది. ఆ యూనివర్సిటీ తెలంగాణ ప్రజలకు ఉన్నత విద్య, పరిశోధన సౌకర్యాలను సులభతరం చేయడంతో పాటు ప్రోత్సహిస్తుంది. ఈ యూనివర్సిటీ దేశంలోని గిరిజన ప్రజలకు గిరిజన కళలు, సంస్కృతి, ఆచారాలు, సాంకేతిక పరిజ్ఞానంలో పురోగతిలో బోధన, పరిశోధన సౌకర్యాలను అందించడం ద్వారా అధునాతన జ్ఞానాన్ని ప్రోత్సహిస్తుంది. గిరిజన విద్యపై దృష్టి సారించడంతో పాటు ఇతర కేంద్ర విశ్వ విద్యాలయాలు అందించే అన్ని రకాల సదుపాయాలను అందిస్తుంది.
ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి వచ్చారు. మహబూబ్ నగర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీంతో ఈ అంశం పతాక శీర్షికలకు ఎక్కింది.
గిరిజన యూనివర్సిటీ బిల్లు లోక్ సభలో ప్రవేశపెట్టడంపై బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమరెడ్డి స్పందించారు. తమ పార్టీ ఎప్పుడూ మాటకు కట్టుబడి ఉంటుందన్నారు. పసుపు బోర్డును కూడా కేంద్రం అందజేసి కాజీపేటకు రైల్వే తయారీ యూనిట్ ఇచ్చిందని అన్నారు. ఒక గిరిజన మహిళను దేశానికి తొలి రాష్ట్రపతిని చేసింది కూడా తమ పార్టీయే అని తెలిపారు.
కాగా.. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం తెలంగాణలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు తప్పనిసరి హామీగా ఉంది. దీంతో ఇప్పటికే ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయాల చట్టం- 2009ను సవరణలు చేశారు. అందులో తెలంగాణలో ఏర్పాటు చేయనున్న గిరిజన యూనివర్సిటీ పేరును చేర్చారు.