Telangana Rains: మిచౌంగ్ తుఫాను కారణంగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి.
heavy rain in Telangana: దక్షిణ భారతంలో మిచౌంగ్ తుఫాను ప్రభావం కొనసాగుతోంది. తమిళనాడు ఆంధ్ర ప్రదేశ్ లలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణపై కూడా తుఫాన్ ప్రభావం కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. తెలంగాణలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, కరీంనగర్, పెద్దపల్లి నల్లగొండ, జనగామ, యాదాద్రి-భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో చిరు జల్లుల నుంచి మోస్తారు వర్షాలు పడుతున్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాను తీవ్ర తుఫానుగా మారడంతో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, కరీంనగర్, పెద్దపల్లి, నల్లగొండ, జనగామ, యాదాద్రి-భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. చెదురుమొదురు వర్షాలు పడగాయని పేర్కొంది.
ఈ తీవ్ర తుఫాను క్రమంగా బలపడి దాదాపు ఉత్తర దిశగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరగా పయనించి డిసెంబర్ 5న బాపట్ల సమీపంలో నెల్లూరు- మచిలీపట్నం మధ్య దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం దాటే అవకాశం ఉందనీ, గంటకు 90-100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని సోమవారం ఐఎండీ తెలిపింది. హైదరాబాద్-సికింద్రాబాద్ జంటనగరాల పరిధిలో సోమవారం పగటి పూట 27 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలు, పగటిపూట 27 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాలు మేఘావృతమైన వాతావరణంతో ఉన్నాయి.