నిన్న ఖమ్మంలో నిర్వహించిన సభలో బీఆర్ఎస్ పై రాహుల్ గాంధీ విమర్శలు చేశారు.ఈ విమర్శలకు బీఆర్ఎస్ కౌంటరిచ్చింది.
హైదరాబాద్:రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చూస్తే రాజకీయంగా ఎలాంటి అవగాహన లేదని తేలిందని బీఆర్ఎస్ ఎంపీ కే.కేశవరావు విమర్శించారు. నిన్న ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జన గర్జన సభలో బీఆర్ఎస్ పై రాహుల్ గాంధీ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చింది బీఆర్ఎస్.సోమవారంనాడు బీఆర్ఎస్ కార్యాలయంలో ఆ పార్టీ ఎంపీ కె. కేశవరావు మీడియాతో మాట్లాడారు. ఖమ్మం వేదికగా రాహుల్ గాంధీ తప్పుడు మాటలు మాట్లాడారన్నారు.
రైతు చట్టాలకు వ్యతిరేకంగా పార్లమెంట్ వేదికగా బీఆర్ఎస్ పోరాటం చేసిందని ఆయన గుర్తు చేశారు. పార్లమెంట్ సాక్షిగా బీజేపీ విధానాలను ఎండగట్టింది తమ పార్టీయేనని కేశవరావు ఈ సందర్భంగా ప్రస్తావించారు. విపక్షాల భేటీకి బీఆర్ఎస్ వస్తే తాము రాబోమని రాహుల్ గాంధీ ఖమ్మం సభలో చేసిన వ్యాఖ్యలను కేశవరావు ప్రస్తావించారు. రాహుల్ గాంధీ వంటి నేత అలా మాట్లాడడం సరైందేనా అని ఆయన ప్రశ్నించారు. అందరితో కలిసి పోవడం నాయకుడి లక్షణమన్నారు. అందుకు విరుద్దంగా రాహుల్ గాంధీ వ్యవహరించారని కేకే విమర్శించారు.
రైతు చట్టాలకు బీఆర్ఎస్ సపోర్టు చేసిందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం ఆయన అహంకారానికి నిదర్శనమని కేశవరావు పేర్కొన్నారు. రైతు చట్టాలను కేంద్రం వెనక్కు తీసుకోవడానికి బీఆర్ఎస్ కారణమన్నారు. బీజేపీపై పోరాటంలో బీఆర్ఎస్ వెనుకడుగు వేయదన్నారు. బీజేపీతో తమ పార్టీ పోరాడినంతంగా ఏ పార్టీ పోరాటం చేయడం లేదని కేశవరావు చెప్పారు. ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేయాలనే వైఖరి సరికాదన్నారు.