
హైదరాబాద్: ఖమ్మం సభ కాంగ్రెస్‌లో జోష్‌ను మరింత పెంచింది. ఈ సభకు లక్షలాదిగా కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు రావడంతో కాంగ్రెస్ రాష్ట్రనాయకత్వం సహా హైకమాండ్ ఖుషీ అయింది. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగించుకున్న భట్టి విక్రమార్కను రాహుల్ గాంధీ సభా వేదికపై ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ సత్కరించారు. భుజం తట్టి సభ ముందు భాగానికి వచ్చి అభివాదం చేశారు.
ఈ సభలో రాహుల్ గాంధీ అధికార బీఆర్ఎస్ పార్టీపై, అలాగే బీజేపీపైనా నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ అవినీతి పార్టీ అని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే రూ. 4000 పింఛన్ ఇస్తామని ప్రకటించారు. పలు హామీల జల్లు కురిపించారు.
టీపీసీసీ రేవంత్ రెడ్డి కూడా భట్టి విక్రమార్కను మెచ్చుకున్నారు. ఆయన పాదయాత్రలో పేదలకు ఇచ్చిన హామీలు, చెప్పిన అంశాలను పరిశీలిస్తామని, మ్యానిఫెస్టోలో వాటికి అవకాశం కల్పిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.
Also Read: షిండేపై వేటు పడుతుంది.. నెక్స్ట్ సీఎం అజిత్ పవార్: సంజయ్ రౌత్ సంచలనం
సభ ముగిసిన తర్వాత రాహుల్ గాంధీ తిరిగి గవన్నవరం విమానాశ్రయానికి బయల్దేరారు. రాహుల్ గాంధీ తనతోపాటు భట్టి విక్రమార్కను కారులో తీసుకెళ్లారు. గన్నవరం వెళ్లే వరకు భట్టితో రాహుల్ గాంధీ ప్రత్యేక మంతనాలు జరిపినట్టు తెలుస్తున్నది. పార్టీ గురించి రాహుల్ గాంధీ కొన్ని కీలక సూచనలు చేసినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో తెలంగాణలో మల్లు భట్టి విక్రమార్కకు హైకమాండ్ నుంచి స్పెషల్ ట్రీట్‌మెంట్ లభించిందని, భవిష్యత్‌లోనూ ఆయన పట్ల అధిష్టానం సానుకూలంగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయనే చర్చ మొదలైంది.