స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఇవాళ భేటీ అయ్యారు. రాజయ్యను వినయ్ భాస్కర్ బుజ్జగిస్తున్నారని సమాచారం.
వరంగల్: స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మంగళవారంనాడు భేటీ అయ్యారు. రాజయ్యను వినయ్ భాస్కర్ బుజ్జగిస్తున్నారని సమాచారం. స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ టిక్కెట్టు దక్కకపోవడంతో తాటికొండ రాజయ్య అసంతృప్తితో ఉన్నారు. ఈ స్థానం నుండి కడియం శ్రీహరికి బీఆర్ఎస్ నాయకత్వం టిక్కెట్టు కేటాయించింది. దీంతో తాటికొండ రాజయ్య తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రజల మధ్యే ఉంటానని రాజయ్య తేల్చి చెప్పారు. పంట చేతికొచ్చిన సమయంలో కుప్పమీద కూర్చొనేందుకు వస్తే చూస్తూ ఊరుకుంటామా అని వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ విగ్రహం పడుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఈ పరిణామాలతో కేసీఆర్ తన దూతగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరర్ రెడ్డిని తాటికొండ రాజయ్య వద్దకు పంపారు. అయితే పల్లా రాజేశ్వర్ రెడ్డిని రాజయ్య కలవలేదు. రాజయ్య నివాసానికి పల్లా రాజేశ్వర్ రెడ్డి వెళ్లిన సమయంలో ఆయన అందుబాటులో లేకుండా పోయారు. దీంతో తాటికొండ రాజయ్య అనుచరులతో పల్లా రాజేశ్వర్ రెడ్డి చర్చించారు. ఎన్నికల తర్వాత రాజయ్యకు మంచి పదవిని సీఎం కేసీఆర్ కేటాయిస్తారని హామీ ఇచ్చారు.
ఇదిలా ఉంటే నిన్న మాజీ డిప్యూటీ సీఎం,కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహతో తాటికొండ రాజయ్య భేటీ అయ్యారు. ఈ భేటీ ప్రస్తుతం వరంగల్ రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. బీఆర్ఎస్ టిక్కెట్టు దక్కని కారణంగా రాజయ్య కాంగ్రెస్ పార్టీలో చేరుతారా అనే చర్చ ప్రారంభమైంది. దళిత మేథావులు సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన దామోదర రాజనర్సింహతో రాజయ్య భేటీ అయ్యారు. ఈ భేటీ మర్యాద పూర్వకంగా జరిగిందని రాజయ్య వర్గీయులు చెబుతున్నారు. కానీ దీని వెనుక రాజకీయ కారణాలను కొట్టిపారేయలేమని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.ఈ పరిణామాల నేపథ్యంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఇవాళ తాటికొండ రాజయ్యతో భేటీ అయ్యారు. రాజయ్యను బుజ్జగిస్తున్నట్టుగా సమాచారం. అయితే బీఆర్ఎస్ నాయకత్వం బుజ్జగింపులకు రాజయ్య ఎలా స్పందిస్తారనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.
also read:దామోదర రాజనర్సింహతో తాటికొండ రాజయ్య భేటీ.. కాంగ్రెస్‌లోకి వెళ్తారా, ఏం జరుగుతోంది..?
2009, 2014, 2018 ఎన్నికల్లో స్టేషన్ ఘన్ పూర్ తాటికొండ రాజయ్య విజయం సాధించారు. ఈ దఫా కూడ ఆయన ఇదే స్థానం నుండి పోటీ చేయడానికి రంగం సిద్దం చేసుకున్నారు. కానీ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ రాజయ్యకు టిక్కెట్టు ఇవ్వలేదు.