హైద్రాబాద్‌లో భారీ వర్షం: ప్రగతి భవన్ వద్ద ట్రాఫిక్ జామ్, వాహనదారుల ఇక్కట్లు

By narsimha lode  |  First Published Sep 5, 2023, 11:20 AM IST

హైద్రాబాద్ బేగంపేటలోని  సీఎం క్యాంప్ కార్యాలయం ప్రగతి భవన్ వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.  రోడ్డుపైకి భారీగా వర్షం నీరు చేరడంతో  వాహనాల రాకపోకలకు  ఇబ్బంది ఏర్పడింది.


హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ నివాసం ఉండే ప్రగతి భవన్ వద్ద  భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.  ఈ ప్రాంతంలో రోడ్డుపై  వర్షం నీరు నిలిచిపోయింది. దీంతో  వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది నెలకొంది. దీంతో పంజాగుట్ట ఫ్లైఓవర్ నుండి  బేగంపేట ఫ్లైఓవర్ వరకు వాహనాలు నిలిచిపోయాయి.  ఈ ప్రాంతంలో  వాహనాల రద్దీ లేకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు.

మూడు రోజులుగా హైద్రాబాద్ నగరంలో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఉదయం నుండి  భారీ వర్షపాతం హైద్రాబాద్ నగరంలో నమోదైంది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి.  రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి.  రోడ్లపై వర్షం నీరు నిలిచిపోయింది.  నిలిచిపోయిన వర్షం నీటిని  తొలగించేందుకు  జీహెచ్ఎంసీ అధికారులు ప్రయత్నిస్తున్నారు.  

Latest Videos

undefined

తెలంగాణకు మరో మూడు  రోజుల పాటు  వర్షాలు కురిసే అవకాశాలున్నాయిన వాతావరణ శాఖ తెలిపింది.  దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అవసరమైతే తప్ప  బయటకు రావొద్దని కూడ సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో  అత్యవసర సేవల కోసం  కంట్రోల్ రూమ్ నుఏర్పాటు చేశారు.  ఈ కంట్రోల్ రూమ్ కు  ఫోన్ చేయాలని  అధికారులు  కోరారు. ఇదిలా ఉంటే   హైద్రాబాద్  లో వర్షాలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇవాళ సమీక్ష నిర్వహించారు.  ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.  రోడ్లపై  నిలిచిన వర్షం నీటిని వెంటనే తొలగించాలని  అధికారులకు  మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

also read:హైద్రాబాద్‌ను ముంచెత్తిన వాన: నీట మునిగిన పలు కాలనీలు, కొట్టుకుపోయిన వాహనాలు

హైద్రాబాద్ నగరంతో పాటు  రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడ భారీ వర్షాలు కురుస్తున్నాయి.  దీంతో  రాష్ట్ర వ్యాప్తంగా  అధికారులు అప్రమత్తంగా ఉండాలని  ప్రభుత్వం  ఆదేశించింది.  ఈ ఏడాది జూలై మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ఆగస్టు మాసంలో  సాధారణ వర్షపాతం కూడ నమోదు కాలేదు. కానీ సెప్టెంబర్ ఆరంభంలో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ప్రారంభమయ్యాయి.మూడు రోజులుగా  తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.   అయితే  సమయానుకూలంగా వర్షాలు కురవకపోవడంతో  పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని  వ్యవసాయశాఖాధికారులు అభిప్రాయపడుతున్నారు.

భారీ వర్షాల కారణంగా నగరంలోని  పలు ప్రాంతాల్లో వరద నీరు  ఇళ్లలోకి చేరింది. లోతట్టు ప్రాంతాల్లో  వరద నీరు నిలిచిపోయింది.  ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు  ఆందోళన చెందుతున్నారు. భారీీ వర్షాలతో  లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన వర్షం నీటిని తొలగించేందుకు  అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. 

click me!