బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత కొండా మురళికి పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
వరంగల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, ఐటీ మంత్రి కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే కొండా మురళిపై ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సీరియస్ అయ్యారు. కేటీఆర్ అటు ఇటు కాదు కాబట్టే మీసాలు రావని... అందుకే తన మీసాల మీద కామెంట్ చేసాడని మురళి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యలపై ధర్మారెడ్డి స్పందిస్తూ మాట్లాడితే మగతనం అనేవాళ్లు ఎలా నిరూపించుకోవాలో కూడా చెప్పాలన్నారు. మగతనం ఉండాలంటే మీసాలు ఉండాలా? అని ప్రశ్నించారు. కొండా మురళి కుక్కలా అరవడం మానేయాలని ధర్మారెడ్డి హెచ్చరించారు.
కొండా మురళి, సురేఖ దంపతులతో పాటు వారి బిడ్డ కూడా పద్ధతి లేకుండా మాట్లాడుతోంది... అసలు వాళ్ళ భాష ఏమిటంటూ ఎమ్మెల్యే ధర్మారెడ్డి మండిపడ్డారు.గౌరవప్రదమైన పదవుల్లో వున్నవారిని పట్టుకుని ఇష్టమొచ్చినట్లు దుర్భాషలాడటం తగదని... సంస్కారం లేకుండా వ్యవహరించకూడదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై మరోసారి అనుచితంగా మాట్లాడితే ప్రజలే కొండా మురళిని ఉరికించి కొడతారని ధర్మారెడ్డి హెచ్చరించారు.
రాజకీయంగా అవకాశాలిచ్చిన వారినే బూతులు తిట్టేరకం కొండా దంపతులని చల్లా ధర్మారెడ్డి అన్నారు. కాంగ్రెస్ లోంచి బయటకు వెళ్లేటపుడు సోనియా గాంధీని, ఆ తర్వాత వైసిపిని వీడేటపుడు వైఎస్ జగన్ ను, బిఆర్ఎస్ ను వీడగానే కేసీఆర్ ను తిట్టారని... రేపు రేవంత్ రెడ్డి ని కూడా తిడతారని అన్నారు. అందర్నీ తిట్టే కొండా మురళి ముందు భాష మార్చుకోవాలన్నారు. కేసీఆర్, కేటీఆర్ ల కాలిగోటికి కూడా కొండా ఫ్యామిలీ పనికిరారు... ఇకపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తాను నోరు తెరవాల్సి వస్తుందని ధర్మారెడ్డి హెచ్చరించారు.
Read More పాదాల మీద నడిచే యాత్రే పాదయాత్ర... రేవంత్ నోట షర్మిల డైలాగ్
అన్నిపార్టీలు కొండా దంపతులను దూరంపెట్టిన సమయంలో కేసీఆర్ పార్టీలో చేర్చుకుని రాజకీయ పునర్జన్ ఇచ్చారని... అలాంటి నాయకున్ని పట్టుకుని అవాకులు చవాకులు పేలుతున్నారని ధర్మారెడ్డి అన్నారు. అసలు వరంగల్ అభివృద్ధిలో కొండా మురళి పాత్ర ఏమిటీ? వారు ఏం చేసి అన్ని ఆస్తులు కూడబెట్టారు? అని నిలదీసారు. తాను పెద్ద గూండాను, హంతకుడినని మురళి ఒప్పుకుంటున్నారని... దమ్ముంటే పరకాలకు వచ్చి తనపై పోటీ చేసి గెలువాలని సవాల్ విసిరారు.
కొండా మురళి చేసిన పనులకు ఆ దేవుడు తప్పకుండా శిక్ష వేస్తాడని ధర్మారెడ్డి అన్నారు. చేయని పనులకు కూడా బిల్లులు క్లెయిమ్ చేసుకున్న మోసగాడు కొండా అని ధర్మారెడ్డి ఆరోపించారు. అందర్నీ అక్కున చేర్చుకోవాలని కేసీఆర్ భావించి కొండా దంపతులకు రాజకీయ భిక్ష పెట్టారని....అయినా వారు ఆ గౌరవాన్ని నిలుపుకోలేకపోయారని ఎమ్మెల్యే ధర్మారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.