JANGAON: భూ వివాదం నేపథ్యంలో మాజీ ఎంపీడీవో, ఆర్టీఐ కార్యకర్త హత్య దారుణ హత్యకు గురయ్యారు. మృతుడు రామకృష్ణయ్యను నిందితులు హత్య చేసిన అనంతరం ఆయన మృతదేహాన్ని చంపక్ హిల్స్ ప్రాంతంలోని క్వారీ చెరువులో పడేశారు.
MPDO Murder Case: భూ వివాదం నేపథ్యంలో మాజీ ఎంపీడీవో, ఆర్టీఐ కార్యకర్త హత్య దారుణ హత్యకు గురయ్యారు. మృతుడు రామకృష్ణయ్యను నిందితులు హత్య చేసిన అనంతరం ఆయన మృతదేహాన్ని చంపక్ హిల్స్ ప్రాంతంలోని క్వారీ చెరువులో పడేశారు. ఈ ఘటన తెలంగాణలోని జనగామ జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. రిటైర్డ్ మండల పరిషత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (ఎంపీడీవో), సమాచార హక్కు (ఆర్టీఐ) కార్యకర్తను జూన్ 15న జనగామ జిల్లాలోని స్టోన్ క్రషర్ సమీపంలోని చెరువులో హత్య చేశారు. ఆదివారం అతడి మృతదేహాన్ని వెలికితీశారు. బచ్చన్నపేట మండలం పోచన్నపేట గ్రామానికి చెందిన నల్లా రామకృష్ణయ్య (70) గురువారం అదృశ్యమయ్యాడు. వెళ్లే ముందు బచ్చన్నపేట పోలీసులకు భూ వివాదం గురించి ఫిర్యాదు చేస్తానని కొడుకు అశోక్‌కు చెప్పినట్లు సమాచారం. అయితే రామకృష్ణయ్యను ఓ ముఠా కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసులో జీ అంజయ్య (బీఆర్‌ఎస్‌కు చెందిన జెడ్పీటీసీ సభ్యురాలి భర్త), డీ శ్రీకాంత్, శివరాత్రి బాషా అలియాస్ భాస్కర్‌లను నిందితులుగా అరెస్టు చేయగా మరో ఇద్దరు నిందితులు డీ తిరుపతి, డీ రాజు పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద నుంచి రూ.15000 నగదు, మూడు మొబైల్ ఫోన్లు, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ (సీపీ) ఏవీ రంగనాథ్ మీడియాతో మాట్లాడుతూ.. అరెస్టయిన వ్యక్తులు విచారణలో నేరం అంగీకరించారని తెలిపారు. పోచన్నపేట గ్రామంలో 8.04 ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ భూమిని కేటాయించడాన్ని సవాల్ చేస్తూ రామకృష్ణయ్య ఆర్టీఐ దరఖాస్తు చేసి మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించినట్లు పోలీసులు తెలిపారు.
అయితే ఈ భూమిని జీ అంజయ్య ఆక్రమించుకుని అధికారులను తప్పుదోవ పట్టించి పట్టా పొందారనీ, గతంలో భూ పట్టాలను రద్దు చేయాలని రామకృష్ణయ్య కోర్టులో ఫిర్యాదు కూడా చేశారు. రామకృష్ణయ్య చర్యలు అంజయ్యకు కోపం తెప్పించాయి. అతని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అనంతరం నలుగురిని కిరాయి గుండాలను తీసుకుని రూ.8 లక్షలు చెల్లించి రామకృష్ణయ్యను హత్య చేయాలని కోరాడు. జూన్ 15న అంజయ్య ముఠా సభ్యులకు అడ్వాన్స్‌గా రూ.2.5 లక్షలు చెల్లించి, పోచన్నపేట శివారు నుంచి రామకృష్ణయ్యను అపహరించి నిర్మానుష్య ప్రాంతానికి బలవంతంగా తీసుకెళ్లాడు. రామకృష్ణయ్యను హత్య చేసి మృతదేహాన్ని చంపక్ హిల్స్ ప్రాంతంలోని క్వారీ చెరువులో పడేశారు.
ఈ ఘటన జరిగిన ప్రాంతంలో ఉన్న సమీపంలోని స్థానికులు అతని మృతదేహాన్ని కనుగొన్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బాధితుడి మృతదేహాన్ని శవపరీక్ష కోసం తరలించారు. బచ్చన్నపేట పోలీసులతో పాటు టాస్క్‌ఫోర్స్ మృతదేహాన్ని వెలికితీసిన గంటలోపే నిందితులను గుర్తించగలిగామని కమిషనర్ తెలిపారు. "అంజయ్య నేరంలో తన ప్రమేయాన్ని అంగీకరించాడు. భూమి వివాదంపై అక్టోబర్ 20, 2022 న తన కోడలు సుభద్రను చంపడానికి అదే ముఠాను నియమించినట్లు కూడా వెల్లడించాడు" అని కమిషనర్ తెలిపారు.