నిరసన: ఆటోలో అసెంబ్లీకి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

By narsimha lodeFirst Published Feb 9, 2024, 11:20 AM IST
Highlights

ఆటో డ్రైవర్ల అంశంలో  అధికార కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేందుకు భారత రాష్ట్ర సమితి ప్రయత్నిస్తుంది.

హైదరాబాద్: ఆటో డ్రైవర్ల విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా  శుక్రవారం నాడు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రజా ప్రతినిధులు  ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.

ఇవాళ బడ్జెట్ సమావేశాలకు  ఆటోలో వెళ్లారు భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుండి ఆటోలో అసెంబ్లీకి వెళ్లారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో  తమకు ఉపాధి లేకుండా పోయిందని ఆటోడ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు.దీంతో ఆటో డ్రైవర్లకు  ఇచ్చిన హామీలను అమలు చేయాలని  కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. 

ఆటో డ్రైవర్లను  ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి,బీఆర్ఎస్ ఎమ్మెల్సీ హరీష్ రావు చెప్పారు.ఆటో డ్రైవర్లకు  నెలకు రూ. 10 వేలు ఇవ్వాలని మాజీ మంత్రి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.6.5 లక్షల మంది ఆటో కార్మికులు రోడ్డున పడ్డారని  ఆయన ఆరోపించారు.మరణించిన ఆటో డ్రైవర్ల కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలని మాజీ మంత్రి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అసెంబ్లీలోకి  ప్లకార్డులు తీసుకెళ్లేందుకు  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. అయితే  పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో  బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు  వాగ్వాదానికి దిగారు.
 

click me!