తెలంగాణ రాజకీయాల్లో సీన్ రివర్స్ అయ్యింది. గతంలో కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ లోకి వలసలు కొనసాగగా ప్రస్తుతం బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు సాగుతున్నాయి.
హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. గత పదేళ్లుగా బిఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగగా... ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టైం వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ను దెబ్బకొట్టిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లో అదే రిజల్ట్ కోసం ప్రయత్నిస్తోంది. అందుకోసమే బలహీనంగా వున్న ప్రాంతాల్లో బలాన్ని పెంచుకునేందుకు కీలక బిఆర్ఎస్ నేతలకు గాలం వేస్తోంది అధికార పార్టీ. ముఖ్యంగా హైదరాబాద్ పై స్పెషల్ ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది. ఇందులో భాగంగానే తాజాగా హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్, బిఆర్ఎస్ కార్పోరేటర్ బాబా ఫసియుద్దిన్ కాంగ్రెస్ గూటికి చేరారు.
బిఆర్ఎస్ ఆవిర్భావం నుండి పార్టీలో కొనసాగుతున్న ఫసియుద్దిన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సన్నిహితుడు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని బిఆర్ఎస్ పెద్దలదృష్టిలో పడ్డ ఫసియుద్దిన్ కు రాష్ట్ర ఏర్పాటుతర్వాత జిహెచ్ఎంసి డిప్యూటీ మేయర్ పదవి దక్కింది. కానీ ఆ తర్వాత ఆయనకు పార్టీలో తగిన ప్రాధాన్యత దక్కకపోవడంతో అసంతృప్తికి గురయ్యాడు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తో విబేధాలతో ఫసియుద్దిన్ కు బిఆర్ఎస్ ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. ఇలా గుర్తింపులేకుండా బిఆర్ఎస్ పార్టీలో కొనసాగడం ఇష్టంలేకే ఆయన కాంగ్రెస్ లో చేరినట్లు తెలుస్తోంది.
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో ఫసియుద్దిన్ కాంగ్రెస్ లో చేరారు. ఆమె కాంగ్రెస్ కండువా కప్పి ఫసియుద్దిన్ ను పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా ఫసియుద్దిన్ కలిసారు. ఫసియుద్దిన్ బాటలోనే మరికొందరు బిఆర్ఎస్ నేతల కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.
Also Read బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్.. సీఎం రేవంత్ తో మాజీ మంత్రి దంపతులు భేటీ ..
కాంగ్రెస్ లో చేరేముందు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రాజీనామా లేఖ పంపించారు ఫసియుద్దిన్. బిఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ స్పోక్స్ పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నాడు. తన రాజీనామాకు దారితీసిన పరిస్థితులను ఈ లేఖలో వివరించారు మాజీ డిప్యూటీ మేయర్.
After joining the Congress Party, paid a courtesy call to the Chief Minister of Telangana and TPCC President Shri Revanth Reddy ji, at his residence. pic.twitter.com/OGmPvUhAMN
— Baba Fasiuddin (@Babafasiuddin)ఇటీవల బిఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్న విధానాలు నచ్చడంలేదని... ఆవిర్భావం నుండి పార్టీ బలోపేతం కోసం పనిచేసిన తనకు రాజకీయ భవిష్యత్ లేకుండా చేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ కుట్రల గురించి తెలిసినా అధిష్టానం చర్యలు తీసుకోకపోగా వారికే మద్దతుగా నిలిచింది.రాజకీయంగానే కాదు బౌతికంగా లేకుండా చేయాలని జరుగుతున్న కుట్రలను అదిష్టానం దృష్టికి తీసుకెళ్ళాను...అయినా ఎలాంటి చర్యలు లేవన్నారు. పార్టీ జెండాను 22 ఏళ్ళుగా భుజాన మోసిన సిపాయికే రక్షణ కరువయ్యింది... అందుకే ఇలాంటి పార్టీలో వుండకూడదని రాజీనామా చేస్తున్నట్లు బాబా ఫసియుద్దిన్ రాజీనామా లేఖలో పేర్కొన్నారు.