కాంగ్రెస్ ప్రభుత్వం సిఫారసు చేసిన ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్టు అమీర్ అలీ ఖాన్‌లను ఎమ్మెల్సీలుగా గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పంపిన పేర్లను ఆమె తిరస్కరించారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు.
Harish Rao: కాంగ్రెస్ సిఫారసు చేసిన పేర్లకు గవర్నర్ తమిళిసై ఎమ్మెల్సీలుగా ఆమోదించడంపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ఈ నిర్ణయం కాంగ్రెస్, బీజేపీల రహస్య స్నేహాన్ని మరోసారి బట్టబయలు చేసిందని ఆరోపణలు చేశారు. తాము సిఫారసు చేసిన వారిని ఏ కారణం చేత తిరస్కరించారో.. అదే కారణం ఉన్నా కాంగ్రెస్ సిఫారసు చేసిన వారిని ఎమ్మెల్సీగా గవర్నర్ ఆమోదించిందని ఫైర్ అయ్యారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణలను గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పోస్టుల కోసం సిఫారసు చేసింది. కానీ, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వారి నియామకాన్ని తిరస్కరించారు. వారు రాజకీయ పార్టీలో సభ్యులుగా ఉన్నారనే కారణం చెబుతూ ఆమె వారి నియామకాన్ని తిరస్కరించారు. తాజాగా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిఫారసు చేసిన ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్టు అమీర్ అలీ ఖాన్ పేర్లను గవర్నర్ ఆమోదం తెలిపారు.
ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ హరీశ్ రావు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం సిఫారసు చేసిన ప్రొఫెసర్ కోదండరాం ఒక రాజకీయ పార్టీలో సభ్యుడు కాదే.. ఆయనే పార్టీకి అధినేత కూడా అని హరీశ్ రావు గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సిఫారసు చేసినప్పుడు అడ్డు వచ్చిన కారణం ఇప్పుడు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ఎందుకు అడ్డురావడం లేదని ప్రశ్నించారు. తాము ప్రభుత్వంలో ఉన్నప్పుడు విద్యా, సామాజిక, సాంస్కృతిక, క్రీడా వంటి సేవా రంగాల్లో కృషి చేసిన వారినీ ఎమ్మెల్సీలుగా సిఫారసు చేసినా.. గవర్నర్ తిరస్కరించారని పేర్కొన్నారు.
Also Read: Republic Day: గణతంత్ర రిపవేడుకల్లో యూపీ నుంచి బాలరాముడి శకటం
కాంగ్రెస్, బీజేపీలు కలిసి బీఆర్ఎస్‌ను టార్గెట్ చేస్తున్నాయని హరీశ్ రావు అన్నారు. బీఆర్ఎస్‌ను పూర్తిగా దెబ్బతీయాలని కుట్రలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇందులో స్వయంగా గవర్నర్ తమిళిసై భాగస్వామి కావడం దురదృష్టకరం అని వాపోయారు. న్యాయ సూత్రాలు, రాజ్యాంగ సాంప్రదాయాలు అన్ని పార్టీలకు ఒకే రకంగా ఉండాలని, కానీ, గవర్నర్ మాత్రం బీఆర్ఎస్‌కు, కాంగ్రెస్‌కు మధ్య తేడా తారతమ్యాలు చూపిస్తున్నారని ఆగ్రహించారు.