
హైదరాబాద్: నూతనంగా బాధ్యతలు తీసుకుని ఆందోళనల బాట పట్టిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జీ కిషన్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. ఇన్నాళ్లు కుంభకర్ణ నిద్రలో ఉండి సడెన్‌గా లేచినట్టు.. సినిమాల్లో మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్‌ల ఎంట్రీ ఇచ్చినట్టుగా కిషన్ రెడ్డి తీరు ఉన్నదని వ్యంగ్యం పోయారు. ఒక వైపు మణిపూర్ తగలబడిపోతున్నా.. నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారని ఫైర్ అయ్యారు. రజాకార్ల ఫైల్స్ సినిమాతో మరేదో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, బుల్డోజర్ల ప్రభుత్వం అని తెలంగాణలో ఎవరి బెదిరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకించిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకుని తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉన్నదని అన్నారు.
కేంద్రం ఒక్క పైసా ఇవ్వని డబుల్ బెడ్ రూమ్‌లను ఏం ముఖం పెట్టుకుని చూడటానికి వెళ్లుతున్నారని దాసోజు ప్రశ్నించారు. తెలంగాణ పట్ల కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతున్నదని అన్నారు. మోడీ సమకాలీకుడివని చెబుతుంటావ్ కదా.. కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వకున్నా డబుల్ బెడ్ రూంలు ఎలా కట్టామో చూసి రండీ అంటూ కామెంట్ చేశారు.
కేసీఆర్ ప్రభుత్వం దళిత బంధు ఇవ్వడాన్ని చూసి కిషన్ రెడ్డి కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారని దాసోజు ఆరోపించారు. బీసీలను ఆదుకుంటామని బీజేపీ చెబితే ఇక్కడ నమ్మడానికి ఎవరూ లేరని అన్నారు. అవినీతి గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదని పేర్కొన్నారు. అందుకే ప్రజలు కర్ణాటకలో కర్రుకాల్చి వాత పెట్టారని విమర్శించారు. అవినీతి గురించి వల్లె వేసే బీజేపీ ప్రభుత్వం ఎందుకు నీరవ్ మోడీ, విజయ్ మాల్యాలను వెనక్కి తీసుకురాలేకపోతున్నదని ప్రశ్నించారు.
Also Read: దూకుడు పెంచిన తెలంగాణ బీజేపీ.. 100 రోజుల ఆందోళనలకు ప్లాన్.. బీఆర్ఎస్‌ను గద్దె దింపడమే టార్గెట్!
కిరణ్ కుమార్‌ను పక్కన పెట్టుకుని తెలంగాణను ఉద్దరిస్తామని చెబితే ఎవరు నమ్ముతారని బీఆర్ఎస్ నేత అడిగారు. తెలంగాణ ద్రోహులను తెచ్చి పెట్టుకున్నారని స్వయంగా బీజేపీ నేత విజయశాంతినే అన్నారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని చూరగొనే ప్రయత్నం చేసుకోండని, కానీ, కేసీఆర్ పై బురదజల్లే ఆరోపణలు చేయడం మానుకోవలని హితవు పలికారు
ఆసియాలోని అతిపెద్ద మురికివాడ, ముంబయిలోని ధారావిని అదానీకి అప్పగించి అభివృద్ధి చేయాలని అనుకుంటున్నారో.. అలాగే తెలంగాణ బీజేకి దమ్ముంటే హైదరాబాద్‌లోని ఓ స్లమ్‌ను అభివృద్ధి చేయాలని సవాల్ విసిరారు. అలా బస్తీని అభివృద్ధి చేసి దానికి అదానీ నగర్, అంబానీ నగర్ అని పేరు పెట్టుకున్నా తమకు ఏ అభ్యంతరం లేదని అన్నారు. గిరిజనులకు ఇప్పటి వరకు సుమారు 4 లక్షలకు పైగా ఎకరాల పట్టాలను అందించామని, సీతక్క తల్లిదండ్రులకూ ఇచ్చామని వివరించారు.