Hyderabad: సుప్రీంకోర్టును ఆశ్రయించి కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టు పనులపై స్టే పొందడం వల్లే రాష్ట్రంలో పాలమూరు ఎత్తిపోతల పథకం ఆలస్యమైందని ఆరోపించిన తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్).. త్వరలో ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, వికారాబాద్ నియోజకవర్గాలకు నీళ్లు వస్తాయని హామీ ఇచ్చారు.
Telangana Chief Minister K Chandrasekhar Rao: తెలంగాణలో మరోసారి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ధీమా వ్యక్తం చేశారు. ఎన్నో ఉద్యమ పోరాటాలతో సాధించుకున్న రాష్ట్రం నేడు దేశంలోనే అనేక రంగాలు, వివిధ సూచీకల్లో అగ్రస్థానంలో ముందుకు సాగుతున్నదని తెలిపారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో అధికార బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని కేసీఆర్ అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని హరితోత్సవం (గ్రీన్ డే) సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందనడంలో తనకు ఎలాంటి సందేహం లేదన్నారు.
తుమ్మలూరులో హరితహారంలో భాగంగా మొక్కను నాటిన ముఖ్యమంత్రి కేసీఆర్.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం అమలుతో తెలంగాణలో పచ్చదనం 7.7 శాతం పెరిగిందన్నారు. తెలంగాణలో ఇప్పటికే 276 కోట్ల మొక్కలు నాటామన్నారు. అందుకే ఎక్కడ చూసినా పచ్చదనం కనిపిస్తుందని తెలిపారు. ప్రతి గ్రామంలో నర్సరీ, ప్రతి గ్రామంలో పల్లెప్రకృతి వనం, పిల్లల కోసం ఓపెన్ జిమ్ లు ఉండేలా అభివృద్ధి చేశామన్నారు. రాష్ట్రంలో పెరిగిన పచ్చదనం సమిష్టి కృషి అన్నారు.
గ్రీన్ డ్రైవ్ లో భాగంగా ఈ ఏడాది నుంచి ప్రజలకు ఉచితంగా పండ్ల మొక్కలను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (ఎ.శాంతికుమారి)ని ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల ఆలస్యంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఖండించారు. సుప్రీంకోర్టును ఆశ్రయించి కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టు పనులపై స్టే పొందడం వల్లే రాష్ట్రంలో పాలమూరు ఎత్తిపోతల పథకం ఆలస్యమైందని ఆరోపించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, వికారాబాద్ నియోజకవర్గాలకు నీళ్లు వస్తాయని హామీ ఇచ్చారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో తెలంగాణను అపహాస్యం చేసిన వారు, వ్యవసాయం ఎలా చేయాలో తెలియదన్నారు. వారు ఇప్పుడు ఏడో స్థానంలో ఉన్నారనీ, తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. తలసరి విద్యుత్ వినియోగం, తలసరి ఆదాయం, వరి ఉత్పత్తి, 24×7 విద్యుత్ సరఫరా తదితర సూచీల్లో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ గా ఉందన్నారు.