ఖమ్మంలో ఇవాళ బీజేపీ సభకు ఆర్టీసీ బస్సులను పంపి బీఆర్ఎస్ సర్కార్ సహకరించిందని కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్: బీజేపీ, బీఆర్ఎస్ మధ్య బంధం ఖమ్మం సభతో మరోసారి రుజువైందని కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.ఆదివారంనాడు దుబ్బాకలో కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మంలో బీజేపీ సభ గురించి వ్యాఖ్యలు చేశారు.
గతంలో తాను కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు తొలుత బస్సులు ఇస్తామని చెప్పి ఆ తర్వాత మాట మార్చారన్నారు. కానీ ఇవాళ ఖమ్మంలో జరిగిన బీజేపీ మీటింగ్ కు బీఆర్ఎస్ సర్కార్ వెయ్యి బస్సులను ఇచ్చిందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. దీంతో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య బంధం మరోసారి తేలిందన్నారు.ఈ మీటింగ్ కు బీఆర్ఎస్ సహకారంతో ఇద్దరి మధ్య ఫెవికల్ బంధం బయటపడిందని ఆయన అభిప్రాయపడ్డారు.కాంగ్రెస్ పై బీజేపీ, బీఆర్ఎస్ లు ప్రత్యక్షంగా, పరోక్షంగా యుద్ధం చేస్తున్నాయన్నారు.
ఈ ఏడాది జూలై 4వ తేదీన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపును పురస్కరించుకొని ఖమ్మంలో నిర్వహించిన బహిరంగసభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు.ఈ సభలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన అనుచరులతో కలసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సభకు ఆర్టీసీ బస్సులు ఇవ్వకుండా బీఆర్ఎస్ సర్కార్ అడ్డుకుందని అప్పట్లోనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే.
also read:తెలంగాణలో ఒంటరిపోరే: బీజేపీ నేతలకు అమిత్ షా దిశా నిర్ధేశం
తెలంగాణపై ఫోకస్ పెట్టిన బీజేపీ నాయకత్వం ఇవాళ ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించింది. రైతు గోస-బీజేపీ భరోసా పేరుతో సభ నిర్వహించింది.ఈ సభలో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సభ తర్వాత తెలంగాణ నేతలతో అమిత్ షా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. తెలంగాణ నేతలకు అమిత్ షా దిశా నిర్ధేశం చేశారు.