మైనంపల్లిని రిప్లేస్ చేయనున్న కేసీఆర్?.. మిగిలిన 4 స్థానాలకు అభ్యర్థులు వీరే..!

Published : Aug 29, 2023, 10:49 AM IST
మైనంపల్లిని రిప్లేస్ చేయనున్న కేసీఆర్?.. మిగిలిన 4 స్థానాలకు అభ్యర్థులు వీరే..!

సారాంశం

తెలంగాణలో వరుసగా మూడోసారి అధికారం కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు.

తెలంగాణలో వరుసగా మూడోసారి అధికారం కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే.. 115 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించేశారు. మిగిలిన నాలుగు  నియోజకవర్గాలకు  కూడా ఈ వారంలో అభ్యర్థులను ప్రకటించాలని చూస్తున్నారు. ఆగస్టు 21న బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన కేసీఆర్.. జనగామ, నర్సాపూర్, నాంపల్లి, గోషామహల్ స్థానాలను మాత్రం పెండింగ్‌లో పెట్టారు. 

అయితే కేసీఆర్ ఇప్పటికే ఈ నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేశారని, ఇక ప్రకటనే తర్వాయి అని  బీఆర్ఎస్ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. అదే సమయంలో మంత్రి హరీష్ రావు టార్గెట్‌గా బహిరంగంగా తీవ్ర విమర్శలు చేస్తున్న మైనంపల్లి హనుమంతరావు‌కు కేటాయించిన టికెట్‌ను రద్దు చేయాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా ప్రచారం సాగుతుంది. 

మంత్రి హరీష్ రావుపై మైనంపల్లి ఆరోపణలు చేసినప్పటికీ బీఆర్ఎస్ అధిష్టానం మైనంపల్లికి మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. అదే సమయంలో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన కుమారుడు  రోహిత్‌కు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వాలనే మైనంపల్లి కోరికకు మాత్రం రెడ్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలోనే మైనంపల్లి హనుమంతరావు వ్యతిరేక గళం వినిపిస్తున్నారు. తన అనుచరులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మైనంపల్లికి చెందినదిగా చెబుతున్న ఆడియో టేప్‌ కూడా తీవ్ర కలకలం రేపింది. మరోవైపు ఆయన బీజేపీలో చేరతారనే ప్రచారం కూడా తెరమీదకు వచ్చింది.

అయితే ఈ పరిణామాల నేపథ్యంలో.. మైనంపల్లి హనుమంతరావు స్థానంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పేరును కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఇక, సోమవారం  రోజు మంత్రి హరీశ్‌రావుతో శంభీపూర్ రాజు భేటీ కావడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇక, జనగామలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి స్థానంలో రైతుబంధు సమితి చైర్మన్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని, నర్సాపూర్‌లో ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి స్థానంలో తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీత లక్ష్మా రెడ్డిని, గోషామహల్‌లో నంద్ కిషోర్ వ్యాస్ బిలాల్, నాంపల్లిలో ఆనంద్ గౌడ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన సెప్టెంబర్ 1న హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. ఆ తర్వాతే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. 

ఇక, తొలుత 115 స్థానాలకు టికెట్లను ప్రకటించిన కేసీఆర్.. ఏడుగురు సిట్టింగ్‌లకు మరోసారి అవకాశం ఇవ్వలేదు. అందులో స్టేషన్ ఘన్‌పూర్, ఉప్పల్, వైరా, ఆసిఫాబాద్, వేములవాడ, ఖానాపూర్, బోథ్ స్థానాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, కోరుట్లలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అభ్యర్థన మేరకు ఆయన కొడుకు సంజయ్‌కు టికెట్ ఇచ్చారు. కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో కూడా పోటీ చేయనున్న నేపథ్యంలో..  కామారెడ్డి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ పోటీకి దూరంగా ఉన్నారు. 

అయితే జనగామ, నర్సాపూర్‌లలో కూడా సిట్టింగ్‌లకు టికెట్ నిరాకరిస్తే.. ఆ జాబితాలో మొత్తం ఎమ్మెల్యే సంఖ్య 9కి చేరుతుంది. మైనంపల్లి  హనుమంతరావుకు కేటాయించిన టికెట్‌ను ఉపసంహరించుకుంటే.. ఆ సంఖ్య 10కి చేరే అవకాశం ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

KCR: కేసీఆర్ ఎంట్రీతో తెలంగాణ రాజకీయం హీట్.. హాట్ కామెంట్స్ తో రచ్చ
KCR Press Meet from Telangana Bhavan: చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు కేసీఆర్‌| Asianet News Telugu