హైదరాబాద్‌లో బ్రిటిష్ మ‌హిళ‌కు శ‌స్త్ర‌చికిత్స‌..

Published : Aug 22, 2025, 04:20 PM IST
British woman bariatric surgery Hyderabad

సారాంశం

అత్యాధునిక వైద్యానికి పేరుగాంచిన హైద‌రాబాద్‌లో తాజాగా మ‌రో అరుదైన శ‌స్త్ర‌చికిత్స జ‌రిగింది. బ్రిటిష్ మ‌హిళ‌కు బ‌రువు త‌గ్గించే శ‌స్త్ర చికిత్స‌ను హైద‌రాబాద్‌లో విజ‌య‌వంతంగా నిర్వ‌హించారు. వివ‌రాల్లోకి వెళితే.. 

Hyderabad: లండన్‌లో టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తూ ఊబకాయం సమస్యతో బాధపడుతున్న ఒక బ్రిటిష్ మహిళ, బరువు తగ్గేందుకు హైదరాబాద్ చేరుకున్నారు. గచ్చిబౌలి కిమ్స్ ఆస్పత్రిలో నిర్వహించిన శస్త్రచికిత్స అనంతరం ఆమె 102 కిలోల బరువుతో ఉండగా ప్రస్తుతం 70 కిలోలకు తగ్గారు. ఈ ఆపరేషన్‌ను ఆస్పత్రి మెటబాలిక్, బేరియాట్రిక్ విభాగం క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ కేశవరెడ్డి మన్నూర్ విజయవంతంగా నిర్వహించారు.

భర్త విజయంతో భార్యకు ప్రేరణ

59 ఏళ్ల అలెగ్జాండ్రియా ఫాక్స్ భర్త జేన్ ఫాక్స్‌కు 2023లో లండన్‌లోనే డాక్టర్ కేశవరెడ్డి శస్త్రచికిత్స చేశారు. దాంతో ఆయన 64 కిలోల బరువు తగ్గి, మధుమేహం, రక్తపోటు, కీళ్ల నొప్పుల వంటి సమస్యలు తగ్గాయి. ఈ ఫలితం చూసిన అలెగ్జాండ్రియా తనకు కూడా అదే చికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకుని, భర్తతో కలిసి హైదరాబాద్ వచ్చారు.

ఆరోగ్య సమస్యలకు శస్త్రచికిత్సే పరిష్కారం

అలెగ్జాండ్రియాకు ఊబకాయం మాత్రమే కాకుండా అధిక రక్తపోటు, కిడ్నీ సమస్యలు, థైరాయిడ్ సమస్యలు కూడా ఉండటంతో వైద్యులు స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ పద్ధతిని ఎంచుకున్నారు. మత్తుమందుకు సంబంధించిన పరీక్షల అనంతరం శస్త్రచికిత్సలో కడుపులో 2/3 వంతు భాగాన్ని తొలగించారు. దాంతో ఆహారం తీసుకునే సామర్థ్యం తగ్గి, బరువు తగ్గడమే కాకుండా మధుమేహం, రక్తపోటు కూడా అదుపులోకి వచ్చాయి.

డాక్టర్ల ప్రకారం ఆమె శరీర ధోరణి సానుకూలంగా స్పందించడంతో 24 గంటల్లోనే కోలుకున్నారు. మరుసటి రోజే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి, హోటల్‌లో స్వేచ్ఛగా నడుస్తున్నారని వైద్యులు తెలిపారు. మూడు రోజుల్లో ఇంగ్లాండ్‌కి తిరిగి వెళ్లేందుకు ఆమె సిద్ధమవుతున్నారు.

అలెగ్జాండ్రియా లండన్‌లో టాక్సీ డ్రైవర్‌గా విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. లండన్‌లో “బ్లాక్ టాక్సీ” డ్రైవర్‌గా పనిచేయడం ఎంతో ప్రతిష్టాత్మకమైన పని. దీనికి కనీసం మూడేళ్ల శిక్షణ అవసరం. నగరంలోని ప్రతి వీధి వివరాలు గుర్తుంచుకోవాలి. ఇంత కష్టతరమైన ఉద్యోగం చేస్తూ ఆరోగ్య సమస్యలతో బాధపడటం ఇష్టం లేకపోవడంతో అలెగ్జాండ్రియా శస్త్రచికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు.

సురక్షితమైన స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ

స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ ప్రస్తుతం ఊబకాయానికి సరళమైన, ఫలితమిచ్చే పద్ధతి అని డాక్టర్ కేశవరెడ్డి వివరించారు. “ఈ పద్ధతిలో కడుపు మళ్లీ వ్యాకోచించకుండా నిరోధించే నూతన సాంకేతికతలు ఉపయోగిస్తున్నాం. దీర్ఘకాలం పాటు రోగులకు మంచి ఫలితాలు వస్తాయి. మధుమేహం, రక్తపోటు, నిద్రలేమి వంటి సమస్యలు తగ్గిపోతాయి. జీవన ప్రమాణం కనీసం పది సంవత్సరాలు మెరుగవుతుంది. మందులు వాడటంకన్నా ఈ శస్త్రచికిత్స ఎంతో సురక్షితం” అని ఆయన అన్నారు.

డాక్టర్ కేశవరెడ్డి మన్నూర్ – అంతర్జాతీయ ఖ్యాతి గల శస్త్రచికిత్స నిపుణుడు

నాలుగు దశాబ్దాలకు పైగా లండన్‌లో వైద్య సేవలందించిన డాక్టర్ కేశవరెడ్డికి, 28 ఏళ్లుగా బేరియాట్రిక్ సర్జరీల్లో ప్రత్యేక అనుభవం ఉంది. 1990లో లండన్‌లో తొలి లాప్రోస్కోపిక్ సర్జరీ, 1998లో మొదటి బేరియాట్రిక్ సర్జరీ చేసిన గౌరవం ఆయనదే. లండన్‌లోనే అతిపెద్ద బేరియాట్రిక్ ఆస్పత్రి స్థాపించారు. అమెరికా, ఆస్ట్రేలియా, గల్ఫ్, యూరప్ దేశాల నుంచి కూడా రోగులు ఆయన దగ్గరకు వచ్చేవారు.

అత్యంత క్లిష్టమైన కేసులను కూడా విజయవంతంగా నిర్వహించినందుకు ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. విదేశాల్లో కొన్నేళ్ల‌పాటు సేవల అనంతరం స్వదేశంపై మమకారంతో హైదరాబాద్ చేరుకుని, ప్రస్తుతం కిమ్స్ ఆస్పత్రిలో క్లినికల్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ విభాగాన్ని దేశంలోనే అగ్రశ్రేణి వైద్య కేంద్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert: మ‌రో 2 రోజులు చుక్క‌లే.. దారుణంగా ప‌డిపోనున్న ఉష్ణోగ్ర‌త‌లు
హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?