
జగిత్యాల : తెలంగాణలోని జగిత్యాల జిల్లా రూరల్ మండలం కన్నాపూర్ గ్రామంలో ఓ విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. తెల్లవారితే పెళ్లి అనగా పెళ్లికూతురైన యువతి తన అక్క భర్తతో ఉడాయించింది. ఈ సంఘటన వెలుగులోకి రావడంతో వరుడు వధువు కుటుంబీకులతో పాటు.. వధువు అక్క తీవ్ర షాక్ కు గురైంది. సంబంధించిన వివరాలలోకి వెళితే.. జగిత్యాల జిల్లా రూరల్ మండలం కన్నాపూర్ గ్రామానికి చెందిన ఓ యువతీకి.. మల్యాల మండలం లంబడి పల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడితో వివాహం నిశ్చయమైంది.
ఆదివారం ఉదయం 11 గంటలకు పెళ్లి ముహూర్తం నిశ్చయించారు. పెళ్లికూతురు ఇంటివద్దె వివాహం జరుగుతుండడంతో దానికి తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక తెల్లవారితే పెళ్లి తంతు మొదలవుతుంది. వధువు, వరుడి ఇళ్లల్లో పెళ్లి హడావుడి ఉంది. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున పెళ్లికూతురు కనిపించకుండా పోయింది. ఈ వార్త రెండు కుటుంబాల్లోనూ ఆందోళన కలిగించింది.
ఒక్క ఛాన్స్ ఇస్తే ఏం చేస్తారు:: బెల్లంపల్లిలో రేవంత్ పై కేటీఆర్ ఫైర్
పెళ్లికూతురు కోసం చుట్టుపక్కల అంతా గాలించడం మొదలుపెట్టారు. కొంతసేపటి తర్వాత పెళ్లికూతురు కుటుంబ సభ్యులకు అసలు విషయం తెలిసింది. అది పెళ్లి కొడుకు కుటుంబానికి కూడా తెలియడంతో అవాక్కయ్యారు. నవవధువుగా పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన పెళ్లికూతురు తన సొంత అక్క భర్తతో పారిపోయింది.
చెల్లెలి పెళ్లి కన్నుల నిండా చూసుకుందామని వచ్చిన ఆ అక్కకు పెద్ద షాక్ తగిలింది. తన చెల్లి.. తన భర్తతోనే ప్రేమాయణం నడిపి.. ఆమెను ఏకంగా పెళ్లి మండపం నుంచి తీసుకెళ్లిపోవడంతో ఆ అక్క కన్నీరు మున్నీరవుతోంది. తన భర్త, చెల్లెలి మధ్య ఇంత జరుగుతున్న తాను ఇంతకాలం గుర్తించలేకపోయానని ఆమె వాపోతోంది. పెళ్లికూతురు చేసిన పని వెలుగు చూడడంతో పెళ్లి క్యాన్సిల్ అయింది. దీంతో ఇరు కుటుంబాల్లోనూ విషాద చాయలు అలుముకున్నాయి.