రేపు తెలంగాణ ఇంటర్ పరీక్షా ఫలితాలు వెల్లడికానున్నాయి.
హైదరాబాద్: ఈ నెల 9వ తేదీన తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు సోమవారంనాడు ప్రకటించింది. రేపు ఉదయం తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నారు. తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు రాసిన 9.5 లక్షల మంది విద్యార్ధుల భవితవ్యం రేపు తేలనుంది .మార్చి 15 నుండి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ పరీక్షలను నిర్వహించారు.20 రోజుల క్రితమే పేపర్ వాల్యూయేషన్ పూర్తైంది.
మరోసారి పేపర్ వాల్యూయేషన్ ను పరిశీలించారు. ఈ నెల 6వ తేదీనే ఇంటర్ పరీక్ష ఫలితాలను ప్రకటించాలని ఇంటర్ బోర్డు భావించింది. ఇంటర్ పరీక్ష ఫలితాల విషయమై అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్షించారు. పరీక్ష ఫలితాల ప్రకటనకు అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా అధికారులు చెప్పారు. దీంతో రేపు ఇంటర్ పరీక్ష ఫలితాలను వెల్లడించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిర్ణయం తీసుకున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్ష ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేస్తారు. ఇంటర్ ఫరీక్ష ఫలితాలను tsbie.cgg.gov.in,examresults.ts.nic.in ,results.cgg.gov.in. వెబ్ సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు
మరో వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ పరీక్ష ఫలితాలను గత వారం విడుదల చేశారు. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటర్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఏపీలో ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల చేసిన తర్వాత తెలంగాణలో ఇంటర్ పరీక్ష ఫలితాలు ఎప్పుడు చేస్తారని విద్యార్ధులు ఎదురు చూస్తున్నారు. అధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాత ఇంటర్ రిజల్ట్స్ ను రేపు విడుదల చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిర్ణయం తీసుకున్నారు.