Hyderabad : హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కు బాంబు బెదిరింపులు

Published : May 15, 2025, 10:58 AM ISTUpdated : May 15, 2025, 11:00 AM IST
Hyderabad : హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కు బాంబు బెదిరింపులు

సారాంశం

శంషాబాద్ విమానాశ్రయానికి మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఎయిర్ పోర్ట్ మొత్తం క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. 

Hyderabad : ఇండియా-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల వేళ ఇటీవల దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. భారత్ లోని విమానాశ్రయాలు, కీలక నగరాలే టార్గెట్ గా పాక్ దాడులకు దిగింది... కానీ మన డిఫెన్స్ సిస్టమ్ ఈ దాడులను సమర్ధవంతంగా అడ్డుకుంది. ఇప్పుడిప్పుడే పరిస్థితి చక్కబడి విమానాశ్రయాల నుండి రాకపోకలు కొనసాగుతున్నాయి... ఈ క్రమంలో హైదరాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు మరోసారి కలకలం రేపాయి.  

శంషాబాద్ ఎయిర్ పోర్టులో బాంబు పెట్టినట్లు అధికారులకు మెయిల్ వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన విమానాశ్రయ అధికారులు భద్రతా సిబ్బందిని రంగంలోకి దింపి తనిఖీలను మరింత ముమ్మరం చేసారు. ప్రయాణికులను, లగేజీని మరింత క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు విమానాశ్రయంలోని మూలమూలన వెతికారు. ఎక్కడా బాంబు లేదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. 

అయితే ఈ బాంబు బెదిరింపు మెయిల్ ఎక్కడినుండి వచ్చిందనేదానిపై  ఆరా తీస్తున్నారు ఎయిర్ పోర్ట్ భద్రతా సిబ్బంది. ఇది ఆకతాయిలా పనా? లేక శత్రువుల పనా? అన్నది తెలియాల్సి ఉంది. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వరుసగా బాంబు బెదిరింపులు వస్తుండటంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.

ఇటీవల కోల్ కతా నుండి హైదరాబాద్ కు వచ్చిన విమానంలో కూడా ఇలాగే బాంబు ఉందని బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. విమానంలోని బాత్రూంలో బాంబు పెట్టామని.. శంషాబాద్ లో దాన్ని పేల్చేస్తామని బెదిరించారు దుండగులు. దీంతో ఆ విమానంలో దాదాపు నాలుగు గంటలపాటు తనఖీలు నిర్వహించారు... అయినా ఎలాంటి బాంబు దొరకలేదు. కేవలం బాంబు బెదిరింపులతో అలజడి రేపడానికి ఆగంతకులు ఈ పని చేసినట్లు తెలుస్తోంది. 

ఇక ఆపరేషన్ సిందూర్ తర్వాత కూడా శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. భారత్ ఉగ్రవాదుల ఏరివేతకోసం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ఆపకపోతే శంషాబాద్ విమానాశ్రయాన్ని పేల్చేస్తామని బెదరించారు. ఈ మేరకు గుర్తుతెలియని వ్యక్తులనుండి మెయిల్ వచ్చింది... దీంతో అప్రమత్తమైన అధికారులు ఎయిర్ పోర్ట్ వద్ద భద్రతను పెంచారు. 
 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శ్రీ సత్యసాయి ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న హీరో విజయ్ దేవరకొండ | Asianet News Telugu
Vijay Deverakonda Superb Speech: విజయ్ దేవరకొండ స్పీచ్ కి సభ మొత్తం అరుపులే | Asianet News Telugu