న్యాయం చేయకపోతే ఆమరణదీక్ష

First Published Feb 5, 2018, 5:57 PM IST
Highlights
  • తక్షణమే సిబిఐ విచారణ జరపాలి
  • చిల్లర పంచాయితి అంటూ పోలీసులు అవమానిస్తున్నారు
  • పోలీసులు టిఆర్ఎస్ నేతలు కుమ్మక్కయ్యారు
  • న్యాయం కోసం ఆమరణ దీక్ష

తన భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ ను చంపిన హంతకులను కఠినంగా శిక్షించకపోతే తాను ఆమరణదీక్షకు దిగుతానని హెచ్చరించారు నల్లగొండ పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి. తన భర్త హత్యలో రాజకీయ కుట్రలు క్లియర్ గా కనిపిస్తున్నప్పటికీ పోలీసులు కానీ.. ప్రభుత్వం కానీ.. చిల్లర పంచాయితీ అని అవమానించడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భర్త హత్యలో టిఆర్ఎస్ నేతల కుట్ర ఉందని తాను మొదటినుంచీ చెబుతున్నానని ఆమె అన్నారు.

సోమవారం ఒక టివి చానెల్ తో లక్ష్మి మాట్లాడారు. తన భర్త హత్య కేసులో నిందితులకు రెండు రోజుల్లోనే ఎలా బెయిల్ వచ్చిందని ఆమె ప్రశ్నించారు. పోలీసులు, టిఆర్ఎస్ నేతలు కుమ్మక్కై తన భర్త హత్య కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తనకు న్యాయం జరగకపోతే ఆమరణదీక్ష చేపట్టి ప్రాణత్యాగానికైనా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని హెచ్చరించారు. జిల్లా పోలీసులు నేరస్తులను రక్షించే పనిలో ఉన్నారని ఆరోపించారు.

పోలీసుల తీరు ముందు నుంచీ అనుమానాస్పదంగానే ఉందని లక్ష్మి ఆరోపించారు. హత్య జరిగిన వెంటనే పోలీసులు వ్యవహరించిన తీరు చూస్తే.. వాళ్లకు పైనుంచి ఆదేశాలున్నాయన్న అనుమనాలు కలుగుతున్నాయన్నారు. తమ భర్త హత్యపై సిబిఐ విచారణ జరిపితేనే వాస్తవాలు బయటకొస్తాయని.. తక్షణమే సిబిఐ విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఎంతటి ఆందోళనకైనా సిద్ధమేనని ప్రకటించారు.

click me!