లిక్కర్ వద్దు-ఉద్యోగాలే ముద్దు నినాదంతో... ఆబ్కారీ భవనం వద్ద బిజెవైఎం మెరుపు ధర్నా, ఉద్రిక్తత

By Arun Kumar PFirst Published Nov 18, 2021, 3:05 PM IST
Highlights

తెలంగాణలో మద్యం షాపుల ఏర్పాటుకు ఎలాగయితే చకచకా పనులు జరిగాయో అలాగే ఉద్యోగాల భర్తీకి కూడా జరగాలంటూ బిజెపి విద్యార్థి విభాగం ఆబ్కారీ భవనం వద్ద  ఆందోళనకు దిగింది. 

హైదరాబాద్: లిక్కర్ వద్దు...‌ ఉద్యోగాలు ముద్దు... సీఎం కేసీఆర్ డౌన్ డౌన్ నినాదాలతో హైదరాబాద్ లోని ఆబ్కారీ కార్యాలయం దద్దరిల్లింది. తెలంగాణ ప్రభుత్వానికి మద్యం విక్రయాలపై వున్న శ్రద్ద నిరుద్యోగ సమస్యపై లేదంటూ బిజెపి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బిజెపి విద్యార్ధి విభాగం బిజెవైఎం (భారతీయ జనతా యువ మోర్చా) ఆధ్వర్యంలో హైదరాబాద్ ఆభ్కారీ భవనం వద్ద ఆందోళన చేపట్టారు. 

నాంపల్లి ఆబ్కారీ కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్న BJYM శ్రేణులు మెరుపు ధర్నా చేపట్టాయి. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే పోలీసులను దాటుకుని బిజెవైఎం కార్యకర్తలు కార్యాలయంలోకి వెళ్లడానికి ప్రయత్నించారు. కార్యాలయం గేట్లు మూసివుంటే వాటిపైకి ఎక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. 

పోలీసులు ఆబ్కారీ భవనంలోకి నిరసనకారులను వెళ్లకుండా అడ్డుకున్నారు. బీజేవైఎం నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు, బిజేవైఎం నాయకులకు మధ్య కొద్దిసేపు వాగ్వివాదం, ఆ తర్వాత తోపులాటలు చోటు చేసుకుంది.

read more  తెలంగాణ.. వైన్స్ కేటాయింపులపై మార్గదర్శకాలు విడుదల.. తొలుత లాటరీ వాళ్లకే..

ఆభ్కారీ భవనంలోకి వెళ్లడానికి రెండు గేట్లు వుండటంతో విద్యార్థి నాయకులు ఒకగేటు వద్ద నుండి మరోగేటువద్దకు... అక్కడికి పోలీసులు వస్తే మళ్ళీ ఈ గేటువద్దకు వస్తూ చుక్కలు చూపించారు. ఇలా చివరకు గేటు దూకి మరీ ఆబ్కారీ కార్యాలయ ప్రాంగణంలోకి చేరుకున్న విద్యార్థి సంఘం నాయకులు ధర్నాకు దిగారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. 

అక్కడితో ఆగకుండా పక్కనేవున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ కార్యాలయ ముట్టడికి బిజెవైఎం నాయకులు యత్నించారు. ఆబ్కారీ భవనం నుండి టీఎస్ పిఎస్సి భవనంం వైపు పరుగుతీసిన విద్యార్థి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని సమీపంలోని పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

నిరసనకు దిగిన విద్యార్థిసంఘాల నాయకులు మాట్లాడుతూ... టీఆర్ఎస్ ప్రభుత్వం మద్యం అమ్మకాలపై కాకుండా ఉద్యోగాల భర్తీపై దృష్టిపెట్టాలని సూచించారు. హుటాహుటిన మద్యం షాపుల కోసం నోటిఫికేషన్ జారీ చేసినట్లే ఉద్యోగాల భర్తీకి కూడా నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేసారు. ఉద్యోగాల భర్తీ చేపట్టేవరకు నిరుద్యోగుల తరపున తమ పోరాటం కొనసాగుతూనే వుంటుందని బిజెవవైఎం నాయకులు స్ఫష్టం చేసారు. 

READ MORE  Liquor shops in Hyderabad: హైదరాబాద్‌లో కోవిడ్ హాస్పిటల్స్, పోలీస్ స్టేషన్‌ల కన్నా వైన్ షాప్‌లే ఎక్కువ.. !

ఇదిలావుంటే ఇప్పటికే మద్యం దుకాణాల కేటాయింపుల్లో రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను తెలంగాణ సర్కార్ విడుదల చేసింది. గౌడ్‌లకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం ప్రభుత్వం నిర్ణయించిన రిజర్వేషన్ల ప్రకారం దుకాణాలు కేటాయించనున్నారు. 

రిజర్వేషన్ల అమలుకు సంబంధించి జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలకు ఏ4 లిక్కర్‌ షాప్‌ (వైన్స్‌)లకు రిజర్వేషన్ల ప్రకారం లాటరీ తీసే బాధ్యతలను అప్పగించారు. ఈ కమిటీలో జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ ఆఫీసర్‌, గిరిజనాభివృద్ధి అధికారి, బీసీ సంక్షేమ అధికారి, ఎస్సీ అభివృద్ధి అధికారి సభ్యులుగా ఉంటారు. రిజర్వేషన్ల అమలు బాధ్యతను ఈ కమిటీలు పర్యవేక్షిస్తాయి. 
 
 ఇక డిసెంబర్ 1, 2021 నుంచి రెండేళ్ల కాలపరిమితికి మద్యం దుకాణాల టెండర్లకు సంబంధించి తెలంగాణ సర్కార్ నవంబర్ 9న నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 18వరకు మద్యం దుకాణలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరిస్తారు. 20న లాటరీ ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు ఉంటుంది. డిసెంబర్ 1 నుంచి లాటరీలో మద్యం దుకాణలు దక్కించుకున్నవారు వాటిని నిర్వహిస్తారు.


 

click me!