
హైదరాబాద్: తెలంగాణకు తాను రాజుగా KCR భావిస్తున్నారని BJP తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ తరుణ్ చుగ్ విమర్శించారు.గురువారం నాడు ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ కు బుద్ది చెబుతారన్నారు. తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగం నడుస్తుందన్నారు. ఎవరైనా రాజ్యాంగం ప్రకారంగా నడుచుకోవాల్సిందేనని తరుణ్ చుగ్ చెప్పారు.
తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య కొంత కాలంగా మాటల యుధ్దం కొనసాగుతుంది. ఇటీవల కాలంలోఇది మరింత పెరిగింది. Huzurabad ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత టీఆర్ఎస్ పై బీజేపీ కూడా మరింత దూకుడును పెంచింది. అయితే టీఆర్ఎస్ కూడా బీజేపీని రాజకీయంగా దెబ్బకొట్టేందుకు అన్ని రకాల అస్త్రాలను బయటకు తీస్తోంది. వరి కొనుగోలు అంశంతో పాటు పలు అంశాలను టీఆర్ఎస్ తెరపైకి తీసుకొచ్చి బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తోంది.కేంద్ర బడ్జెట్ పై తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం లేదని ఈ నెల 1వ తేదీన కేసీఆర్ ప్రకటించారు. బడ్జెట్ లో సామాన్యులతో పాటు ఏ ఒక్కరికి కూడా ప్రయోజనం దక్కదన్నారు.
మరో వైపు బడ్జెట్ పై స్పందిస్తూ రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ కోరారు.ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది.ఈ వ్యాఖ్యలపై న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ నేతలు మౌన దీక్షకు దిగారు. అంతేకాదు పాదయాత్ర కూడా నిర్వహించారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ పై బీజేపీ నేతలు తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ కూడా ఈ వ్యాఖ్యలపై మండిపడింది.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా రాజ్యసభలో ఈ నెల 8వ తేదీన తెలంగాణ విషయమై ప్రధాని Narendra Modi కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ తీవ్రంగా మండిపడుతుంది. తెలంగాణపై మోడీకి ఉన్న చిన్నచూపు ఈ వ్యాఖ్యలతో తేట తెల్లమైందని టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. మోడీ తన మనసులోని మాటను బయట పెట్టారన్నారు.వాజ్ పేయ్ ప్రధానిగా ఉన్న సమయంలో మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేశారని మోడీ తన ప్రసంగంలో గుర్తు చేశారు. కానీ తెలంగాణ విషయంలోనే అశాంతి చెలరేగిందన్నారు. చర్చలు లేకుండానే బిల్లును పాస్ చేశారని మోడీ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను టీఆర్ఎస్, కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయితే ప్రధాని మోడీ వ్యాఖ్యాలను టీఆర్ఎస్ వక్రీకరిస్తుందని బీజేపీ చెబుతుంది. మోడీ వ్యాఖ్యలను బీజేపీ నేతలు సమర్ధిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే టీఆర్ఎస్ నేతలు ఎందుకు స్పందిస్తున్నారని బీజేపీ ప్రశ్నిస్తోంది.