బండి సంజయ్‌కు ఎంపీ టికెట్ ఇవ్వొద్దని, ఒక వేళ ఇస్తే ఆయనకు సహరించే ప్రసక్తే ఉండదని బీజేపీ సీనియర్లు తిరుగుబాటు చేస్తున్నారు. ఎంపీ టికెట్ ఆయనకు ఇవ్వరాదని తీర్మానం చేశారు. ఆయన పార్టీలోని సీనియర్లపై దుష్ప్రచారం చేస్తున్నారని, సీనియర్లను గౌరవించడం లేదని ఆరోపించారు.
హైదరాబాద్: కరీంనగర్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలైన బండి సంజయ్ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. 2019లో కరీంనగర్ ఎంపీగా గెలిచిన ఆయన.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇష్టం లేకున్నా అధిష్టానం ఆదేశాన్ని శిరసావహించి పోటీ చేసినట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో మళ్లీ ఎంపీ సీటు కోసం కసరత్తు ప్రారంభిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఆయనపై పార్టీలోనే వ్యతిరేకత పెరుగుతున్నట్టు తెలుస్తున్నది. కొందరు సీనియర్ నేతలు బండి సంజయ్‌కు ఎంపీ టికెట్ ఇవ్వొద్దని తిరుగుబాటు చేస్తున్నారు. ఏకగ్రీవంగా తీర్మానం కూడా చేశారు.
బండి సంజయ్‌కు ఎంపీ టికెట్ ఇస్తే సహకరించే ప్రశ్నే లేదని ఆ సీనియర్ నేతలు అంటున్నారు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో బండి సంజయ్‌కు వ్యతిరేకంగా కొందరు సీనియర్ నేతలు గురువారం భేటీ అయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన సీనియర్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
బండి సంజయ్ ఒంటెద్దు పోకడలతో పార్టీ తీవ్రంగా నష్టపోతున్నదని, జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఈ నష్టం జరుగుతున్నదని వారు ఆరోపించారు. పార్టీలోని సీనియర్ నాయకులకు కనీస గౌరవం కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
Also Read: Telangana Assembly: మల్లారెడ్డి గూగ్లీ.. ‘అవసరమైతే కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తా’.. మాది పాల‘కులం’
బండి సంజయ్ అందరినీ సమన్వయపరిస్తే ఆయన కరీంనగర్ నుంచి గెలిచేవాడని, మరికొన్ని ఇతర స్థానాల్లోనూ బీజేపీ విజయపతాకాన్ని ఎగరేసేదని ఆ సీనియర్లు పేర్కొన్నారు. బండి సంజయ్ తీరుతో చాలా మంది బాధపడుతున్నారని, పార్టీ మారడమో లేదా.. పార్టీకి దూరంగా జరగడమో చేస్తున్నారని ఆరోపణలు చేశారు. రాష్ట్ర అధ్యక్ష పదవి తొలగించినప్పుడు ఆయనకు అనుకూలంగా ఉన్నవారితో లాబీయింగ్ చేశారని ఆరోపించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయించి మరీ ప్రధాన కార్యదర్శి పదవిని దక్కించుకున్నట్టు వివరించారు. ఈ భేటీలో సీనియర్ లీడర్లు కాశిపేట లింగయ్య, గుజ్జుల రామకృష్ణారెడ్డి, సుగుణాకర్ రావు, అంజయ్య తదితరలు పాల్గొన్నట్టు తెలిసింది.