తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Telangana Governer Tamilisai Soundararajan) ప్రసంగం కొత్తగా ఏమీ లేదని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రకటించిన మేనిఫెస్టోలాగా ఉందని మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి (Kadiyam Srihari) అన్నారు. గత ప్రభుత్వం సాధించిన విజయాలను గవర్నర్ ప్రసంగంలో విస్మరించారని తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. శుక్రవారం సభలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి ఆమె అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు కొత్త ప్రభుత్వం నెరవేర్చాలని, ప్రజాసేవలో విజయం సాధించాలని ఆమె ఆకాంక్షించారు. అనంతరం ప్రభుత్వం చేపట్టాలనుకున్న పనులను ఆమె ప్రసంగం రూపంలో చదివి వినిపించారు.
కాగా.. గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ నేత, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి విమర్శలు చేశారు. సభ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్ ప్రసంగంలో కొత్తదనం ఏమీ లేదని అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను చదివినట్లే ఉందని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో సాధించిన సంక్షేమం, అభివృద్ధిని గవర్నర్ విస్మరించారని ఆరోపించారు. నీతి ఆయోగ్ నుంచి వచ్చిన అవార్డులతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రశంసలను కూడా ఆమె ప్రస్తావించలేదని అన్నారు.
వరి ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని కడియం శ్రీహరి అన్నారు. ఐటీ ఎగుమతుల్లో దేశంలోనే అగ్రగామిగా ఉందని చెప్పారు. గవర్నర్ ప్రసంగంలో తమ ప్రభుత్వ విజయాల గురించి ప్రస్తావించలేదని తెలిపారు. గవర్నర్ అబద్ధాలు చెప్పడం దురదృష్టకరమని అన్నారు. కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ ప్రజలు ప్రత్యేక తెలంగాణను సాధించారని చెప్పారు.
2014లో తెలంగాణకు విముక్తి లభించిందని కడియం శ్రీహరి అన్నారు. కానీ ఇప్పుడు విముక్తి పొందిందని చెప్పడం ఆశ్చర్యంగా ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఆరు హామీల అమలు ప్రక్రియను వెల్లడించడంలో కాంగ్రెస్ విఫలమైందని అన్నారు. దళిత బంధు ప్రస్తావనే లేదని చెప్పారు. గవర్నర్ గత తొమ్మిదన్నరేళ్లుగా తెలంగాణ ఏ మాత్రం పురోగతి సాధించలేదని, అధోగతి పాలైందని చూపించే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. ఇది వాస్తవానికి దూరంగా ఉందని తెలిపారు.