విలువలు, క్రమశిక్షణ, విధేయత: దత్తన్న రాజకీయ ప్రస్థానం

By narsimha lode  |  First Published Sep 1, 2019, 3:07 PM IST

తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయను ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమించింది. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన క్రమశిక్షణ కలిగిన నేతగా గుర్తింపు పొందారు


తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయను ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమించింది. దీంతో ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన క్రమశిక్షణ కలిగిన నేతగా గుర్తింపు పొందారు.

జూన్ 12, 1949న బండారు అంజయ్య, ఈశ్వరమ్మ దంపతులకు హైదరాబాద్‌లో జన్మించారు బండారు దత్తాత్రేయ. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ పట్టాను పొందిన ఆయన.. 1965లో ఆర్ఎస్ఎస్‌లో కార్యకర్తగా చేరారు.

Latest Videos

సంఘ్ కార్యకలాపాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విస్తృతం చేయడానికి దత్తన్న ఎంతగానో కృషి చేశారు. ఆర్ఎస్ఎస్ శాఖలను రాష్ట్రంలో విస్తరించారు. 1965 నుంచి 1989 వరకు సుమారు మూడు దశాబ్ధాల పాటు ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌గా పనిచేశారు.

1977 ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు కార్యక్రమాలు చేపట్టినందుకు అరెస్ట్ కాబడ్డారు. అదే సమయంలో కృష్ణా జిల్లా దివిసీమలో తుఫాను బాధిత ప్రాంతాల్లో పర్యటించి.. స్వయంగా సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఆర్ఎస్ఎస్ శ్రేణులను దివిసీమకు తీసుకెళ్లి సహాయక శిబిరాల ద్వారా తుఫాను బాధితులకు అండగా నిలిచారు. ఈ సమయంలో అక్కడ పర్యటించిన బీజేపీ వ్యవస్థాపక సభ్యుడు, మాజీప్రధాని వాజ్‌పేయ్ దత్తాత్రేయని భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించారు.

1980లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా దత్తన్న వ్యవహరించారు. 1991లో సికింద్రాబాద్ నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ తరపున ఎన్నికైన ఒకే ఒక్క లోక్‌సభ సభ్యుడు దత్తన్న మాత్రమే.

1996 లో‌క్‌సభ ఎన్నికల్లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమారుడు పీవీ రాజేశ్వరరావు చేతిలో దత్తాత్రేయ ఓటమి పాలయ్యారు. అయితే ఆ తర్వాత రెండేళ్లకే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి మరోసారి గెలిచి వాజ్‌పేయ్ మంత్రివర్గంలో పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

1999లో మరోసారి గెలిచి.. పట్టణాభివృద్ధి, రైల్వే శాఖ సహాయ మంత్రిగా సేవలందించారు. 2004, 2009లలో దత్తాత్రేయ వరుసగా ఓటమి పాలయ్యారు. అయితే 2014లో మాత్రం సత్తా చాటి.. మోడీ మంత్రివర్గంలో కార్మిక శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.

అయితే 2017లో కేంద్ర కేబినెట్ విస్తరణ సమయంలో దత్తన్న పదవిని కోల్పోయారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సైతం దత్తాత్రేయకు బీజేపీ అధిష్టానం టికెట్ కేటాయించలేదు.

అయితే ఆయనకు మరేదైనా కీలక పదవి ఇచ్చే అవకాశాలున్నాయని ఎప్పటి నుంచో ప్రచారం జరిగింది. వాటిని నిజం చేస్తూ మోడీ ప్రభుత్వం దత్తన్నను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమించింది. స్నేహశీలిగా పేరొందిన ఆయనకు అన్ని పార్టీల నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. 

తెలంగాణ గవర్నర్ నరసింహాన్ బదిలీ?

నరసింహన్ బదిలీ: తెలంగాణకు సౌందర రాజన్, హిమాచల్‌కు దత్తన్న

ప్రత్యక్ష ఎన్నికల్లో కలిసిరాని విజయం... వరించిన గవర్నర్ గిరి

click me!