
Raghunandan Rao: ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో రోజుకో కీలక పరిణామం చోటుచేసుకుంటుంది. ఇప్పటికే ఈ కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు ఎమ్మెల్సీ కవిత హాజరైన విషయం తెలిసిందే. తాజాగా.. ఎమ్మెల్సీ కవితతో వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్స్ ఆధారాలు అంటూ సుకేశ్ చంద్రశేఖర్ లేఖ విడుదల చేయడంతో మరోసారి తెలంగాణ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఈ పరిణామంలో అటు ఢిల్లీలోనూ.. ఇటు రాష్ట్రంలోనూ బీఆర్ఎస్ పార్టీపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు .. మనీ లాండరింగ్‌లో ప్రత్యక్షంగా ప్రమేయం ఉన్నట్లుగా అనుమానిస్తోన్న బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల గుర్తింపును రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌కు రాసిన లేఖ దుమారం రేపుతోంది.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ..ఎమ్మెల్సీ కవిత, సుఖేష్ చంద్ర వాట్సాప్ చాటింగ్ వ్యవహరంపై దర్యాప్తు చేయాలని ఈడీకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఓ రాజకీయ పార్టీగా ఉంటూ బీఆర్ఎస్ మనీ లాండరింగ్‌కు పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుంభకోణానికి పాల్పడటం ద్వారా బీఆర్ఎస్ కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిందని, ఈ విషయంలో పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించాలంటూ రఘునందన్ రావు డిమాండ్ చేశారు.
మనీ లాండరింగ్ కేసులో జ్యుడీషియరీ విచారణను ఎదుర్కొంటోన్న సుకేష్ వాట్సాప్ చాటింగ్ లో బీఆర్ఎస్ నాయకుడు కారులో తాను 15 కోట్ల రూపాయలను ఇచ్చినట్టు తెలిపారని అన్నారు. నగదు ఉంచిన 6060 రిజిస్ట్రేషన్ నంబర్ గల రేంజ్ రోవర్ కారు ఎవరిది ? అని ప్రశ్నించారు. ఈ విషయంలో తెలంగాణ పోలీసులు మౌనం వీడాలనీ, రాష్ట్ర రవాణా శాఖ కూడా ఈ కేసులో సహకరించాలని కోరారు. బీఆర్ఎస్ .. ఓ రాజకీయ పార్టీగా ఉంటూ మనీ లాండరింగ్‌కు పాల్పడిందని, పార్టీ గుర్తింపును రద్దు చేయాలని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ వ్యవహరంపై సమగ్రంగా విచారణ చేపట్టడానికి తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని, మనీ లాండరింగ్ ఆరోపణలు ఉన్న ఈ కేసును కేంద్రీయ దర్యాప్తు ఏజెన్సీకి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.