తెలంగాణపై బీజేపీ అధిష్టానం స్పెషల్ ఫోకస్.. మూడు రోజులు హైదరాబాద్‌లోనే మోదీ, అమిత్ షా..!

Published : Jun 01, 2022, 02:33 PM IST
తెలంగాణపై బీజేపీ అధిష్టానం స్పెషల్ ఫోకస్.. మూడు రోజులు హైదరాబాద్‌లోనే మోదీ, అమిత్ షా..!

సారాంశం

తెలంగాణపై బీజేపీ అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్లు తెలంగాణలో పర్యటించడంతో బీజేపీ శ్రేణుల్లో జోష్ నెలకొంది.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్‌ వేదిక కానుంది. జూలై మొదటి వారంలో నిర్వహించనున్న ఈ సమావేశాలను హైదరాబాద్‌‌లోని హెచ్‌ఐసీపీలోని నోవాటెల్‌లో జరపాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను పార్టీ నాయకులు సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్న బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్, తెలంగాణ ఇన్‌ చార్జ్ తరుణ్ చుగ్‌తో పాటు రాష్ట్ర నాయకులు.. మాదాపూర్ హెచ్‌ఐసీసీని పరిశీలించారు. జాతీయ కార్యవర్గ సమావేశాలకు వచ్చే అతిథుల కోసం హైటెక్స్, ఇతర హోటళ్లు, రిసార్టులను పరిశీలిస్తున్నారు. సాయంత్రం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నాయకులతో సంతోష్ సమావేశం నిర్వహించనున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాలకు సంబంధించి ఆయన చర్చించనున్నారు.  

ఇక, ఈ సమావేశాలకు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, జాతీయ నేతలు ఈ సమావేశాలకు హాజరుకానున్నారు. ఈ సమావేశాలకు హాజరుకానున్న ప్రధాని మోదీ, అమిత్ షా, ఇతర బీజేపీ నేతలు మూడు రోజుల పాటు నగరంలోనే బస చేయనున్నారు. 

ఇప్పటికే తెలంగాణపై బీజేపీ అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్లు తెలంగాణలో పర్యటించడంతో బీజేపీ శ్రేణుల్లో జోష్ నెలకొంది.

ఇటీవల పాలమూరులో నిర్వహించి బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తుక్కుగూడ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు హాజరై పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. ఐఎస్‌బీ స్నాతకోత్సవంలో హైదరాబాద్‌కు వచ్చిన మోదీ.. బేగంపేట ఎయిర్‌పోర్ట్ వద్ద ఏర్పాటు చేసిన వేదికపై నుంచి బీజేపీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు.  తెలంగాణలో ఒక కుటుంబ పాలన కారణంగా ఉద్యమ ఆకాంక్షలు నెరవేరడం లేదని, పాలన అవినీతిమయంగా మారిందని మోదీ ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారం ఖాయమంటూ.. పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపారు. అయితే మోదీ.. పక్కా వ్యూహంతోనే ఈ విధమైన కామెంట్స్ చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రానున్న రోజుల్లో పెద్ద సంఖ్యలో కేంద్ర మంత్రులు, జాతీయ నేతల తెలంగాణలో పర్యటించనున్నట్టుగా తెలుస్తోంది. 

మరోవైపు తొలిసారిగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను కేంద్రప్రభుత్వం నిర్వహించనుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన 8ఏళ్ల తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ‌శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవం జరగనుంది. ఈ వేడుకలకు హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

అంతేకాకుండా తెలంగాణకు చెందిన కె లక్ష్మణ్‌ను ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపాలని నిర్ణయం తీసుకుంది. ఎలాగైనా తెలంగాణలో కాషాయ జెండాను ఎగరవేయాలని భావిస్తున్న బీజేపీ అధిష్టానం.. వ్యుహాత్మకంగానే జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని దాదాపు ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?