తప్పు చేయని వాళ్లు ఎందుకు భయపడుతున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు. అక్రమాలకు పాల్పడేవారే భయపడుతారన్నారు. అక్రమాలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకోవడమే ఐటీ పని అని లక్ష్మణ్ చెప్పారు.
హైదరాబాద్: తప్పు చేయని వాళ్లు ఎందుకు భయపడుతున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ టీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు.తెలంగాణ మంత్రి మల్లారెడ్డి నివాసంలో ఐటీ దాడుల విషయమై బీజేపీపై ఆరోపణలు చేశారు. బీజేపీ కుట్రలను తిప్పికొడతామన్నారు. ఈ విమర్శలపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ స్పందించారు. అక్రమ సంపాదన, పన్నుఎగవేతదారుల నుండి పన్ను వసూలు చేయడమే ఐటీ శాఖ పని అని ఆయన చెప్పారు. తమను రాజకీయంగా ఎదుర్కోలేకనే తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో బీఎల్ సంతోష్ పేరును ఇరికించారన్నారు.ఈ కేసు విషయమై ఆయన కు నోటీసులు జారీ చేయడాన్ని డాక్టర్ లక్ష్మణ్ తప్పుబట్టారు. దేశం కోసం, సమాజం కోసం , పార్టీ కోసమే బీఎల్ సంతోష్ పనిచేస్తారన్నారు. అలాంటి సంతోష్ కు నోటీసులు ఇవ్వడం ఏమిటన్నారు. తమ పార్టీలో చేర్చుకోవాలంటే బహిరంగంగానే చేర్చుకొంటామన్నారు.తమకు మధ్యవర్తులు అవసరం లేదని లక్ష్మణ్ చెప్పారు. మొయినాబాద్ ఫాంహౌస్ లో ముగ్గురు ఏదో మాట్లాడుకొంటే బీఎల్ సంతోష్ కి నోటీసులు ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు.